Begin typing your search above and press return to search.

బాబు అధికారంలో ఉంటే వ‌ర్షాలు ప‌డ‌వు!

By:  Tupaki Desk   |   21 July 2017 10:17 AM GMT
బాబు అధికారంలో ఉంటే వ‌ర్షాలు ప‌డ‌వు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై, ప‌రిపాల‌న విధానంపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. అనంతపురం జిల్లా మడకశిరలో విలేక‌రులతో మాట్లాడుతూ ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించిన ప‌రిపాల‌న ఏపీలో కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది సామాన్య లబ్ధిదారులు అగ్రిగోల్డ్ సంస్థకు డబ్బులు చెల్లించి నష్టపోయారన్నారు. ఆ సంస్థకు చెందిన భూములు విక్రయించి బాధితులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలకు చేసిన మోసంపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సహచర మంత్రులు కన్నేశార‌ని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుందని ర‌ఘువీరా తెలిపారు.

గత ఏడాది ఖరీఫ్‌ లో రాష్ట్ర ప్రభుత్వం రెయిన్‌గన్ల ద్వారా పంటలకు రక్షకతడులు ఇచ్చినా పంటలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని రఘువీరా ఆరోపించారు. ఇందులో సైతం ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు దోపిడీకి పాల్పడ్డారన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా రాయలసీమలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదన్నారు. 1500 అడుగులు వేసిన బోర్లలో నీరు లభ్యం కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి సమయంలో రక్షకతడుల ద్వారా పంటలకు నీరు అందిస్తామని ఎలా చెబుతారని రఘువీరా ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు చెప్పడానికి, నిధులు దోచుకోవడానికే తప్ప రైతులను ఉద్దరించేందుకు కాదన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న వర్షాలు రావని, రైతులు దిగుబడులు సాధించిన దాఖలాలు లేవని ర‌ఘువీరా ఎద్దేవా చేశారు. హంద్రీనీవా కాలువ పనులను ఈ ఏడాది చివరి నాటికి అయినా పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.