Begin typing your search above and press return to search.

'కరువు.. చంద్రబాబు అవిభక్త కవలలు’

By:  Tupaki Desk   |   25 March 2017 4:39 PM GMT
కరువు.. చంద్రబాబు అవిభక్త కవలలు’
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ప్ప‌టికీ అత‌డే ఒక సైన్యం వ‌లే త‌న‌దైన శైలిలో పోరాటం చేస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి త‌న దూకుడును మ‌రింత పెంచారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు. రైతుల కోసం ర‌ఘువీరారెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు- చంద్రబాబు నాయుడు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో కరువు పోయి అనంతపురం జిల్లాలో దుర్భర పరిస్థితులు వచ్చాయన్నారు. కానీ ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేలా అంతా స‌స్య‌శ్యామలం అని బాబుతో స‌హా టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ర‌ఘువీరా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

రైతుల సంక్షేమం విష‌యంలో ప్రభుత్వానివన్నీ మోసపూరిత ప్రకటనలేనని రఘువీరారెడ్డి మండిప‌డ్డారు. కరవు నివేదికను పంపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని త‌ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ స‌మాయం అంద‌లేద‌ని అన్నారు. తీవ్ర కరువు కార‌ణంగా జిల్లాల్లో దుర్భర పరిస్థితులు వచ్చాయన్నారు. ఉగాది తర్వాత కరవు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ బృందాల పర్యటన ఉంటుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ 80% పూర్తి చేస్తే తామే మొత్తం చేశామ‌న్న‌ట్లుగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ర‌ఘువీరారెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌చారం చేసుకుంటున్న రీతిలో ప‌నులు చేయ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకే సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మాణం చేయాల‌నే డిమాండ్‌తో ఈ ఏడాదిని పోరాటం నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు ర‌ఘువీరారెడ్డి చెప్పారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచి ప్రాజెక్ట‌ల‌నువేగంగా పూర్తి చేయిస్తా మ‌న్నారు.

కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ర‌ఘువీరారెడ్డి పెద‌వి విరిచారు. శాస‌న‌మండ‌లి, శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కే విధంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. అధికార‌- ప్ర‌తిప‌క్ష సవాళ్లు.. ప్రతి సవాళ్లకే అసెంబ్లీలో సమయం సరిపోతుందని ర‌ఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/