Begin typing your search above and press return to search.

ర‌ఘువీరా ఎంట్రీ! బాబు - చిన‌బాబు బుక్క‌య్యారు!

By:  Tupaki Desk   |   19 April 2018 11:07 AM GMT
ర‌ఘువీరా ఎంట్రీ! బాబు - చిన‌బాబు బుక్క‌య్యారు!
X
దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో చేతిలో న‌గ‌దు లేక జ‌నం నానా ఇబ్బందులు ప‌డిన విష‌యం తెలిసిందే క‌దా. ఏటీఎంల‌లో డ‌బ్బుల్లేక‌, బ్యాంకు ఖాతాల్లోని డ‌బ్బును అర‌కొర‌గానే డ్రా చేసుకునేందుకు కూడా గంట‌ల త‌ర‌బ‌డి క్యూల‌లో నిల్చున్న వైనం నిజంగా మ‌నం మ‌రిచిపోలేనిదే. బ్యాంకు ఖాతాల్లో మ‌న సొమ్మున్నా కూడా అవ‌స‌రానికి తీసుకోలేక మ‌నం ప‌డిన ఇబ్బందులు వ‌ర్ణ‌నాతీత‌మ‌నే చెప్పాలి. అయితే దేశంలో న‌ల్ల‌ధ‌నానికి చెక్ పెట్టడంతో పాటుగా అవినీతికి చ‌ర‌మ గీతం పాడేందుకు తీసుకున్న త‌మ నిర్ణ‌యం వ‌ల్ల కాస్తంత ఇబ్బంది అయినా... భ‌విష్య‌త్తు అంతా బాగుంటుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఘ‌నంగానే ప్ర‌క‌టించారు. అయితే వ్య‌వ‌స్థ అప్పటిక‌ప్పుడు చ‌క్క‌బ‌డ‌టం మాట అటుంచితే... నెల‌ల త‌ర‌బ‌డి కరెన్సీ క‌ష్టాలు జనాన్ని నానా అవ‌స్థ‌ల‌కు గురి చేశాయి. అప్పుడు పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను ప‌రిష్కరించే నిమిత్తం కేంద్రం వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు - ఆర్థిక రంగ నిపుణుల‌తో కూడిన ఓ క‌మిటీని వేసింది. ఆ క‌మిటీకి నిన్న‌టిదాకా ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగానే కాకుండా బీజేపీకి అనుంగు మిత్రుడిగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడే.

అస‌లు పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌న‌దేన‌ని - తాను ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాన‌ని చెప్పుకొచ్చిన చంద్ర‌బాబు... పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌స్య‌ల ప‌రిష్కార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించారు కూడా. ఇక వెనువెంట‌నే బాధ్య‌త‌లు స్వీకరించిన చంద్ర‌బాబు... ముంబై వెళ్లి మ‌రీ స‌ద‌రు క‌మిటీ చైర్మ‌న్ హోదాలో మీటింగులు పెట్టి మ‌రీ కేంద్రానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. ఆ త‌ర్వాత ఆ క‌మిటీ ఏమైందో? అస‌లు ఆ క‌మిటీ చైర్మ‌న్‌ గా చంద్ర‌బాబు ఇచ్చిన నివేదిక‌లు ఏమ‌య్యాయో? ఆ నివేదికల్లో బాబు సూచించిన ప‌రిష్కార మార్గాలు ఏమిటో కూడా బ‌య‌ట‌కు రాలేదు. నిజంగానే జ‌నం ఈ విష‌యాల‌ను మ‌రిచిపోయారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ న‌గ‌దుకు కొర‌త రావ‌డంతో మ‌ళ్లీ నాటి ఘ‌ట‌న‌ల‌ను జ‌నం గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా దేశంలో స‌రిప‌డినంత న‌గ‌దు చెలామ‌ణిలోనే ఉంద‌ని, కొర‌త త్వ‌ర‌లోనే స‌ర్దుకుంటుంద‌ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల‌పై టీఆర్ ఎస్ యువ‌నేత కేటీఆర్ తో పాటు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అస‌లు మీరు చెబుతున్న మాట‌లేంటి? జ‌రుగుతున్న‌దేమిట‌ని కూడా నారా లోకేశ్... జైట్లీని దాదాపుగా నిల‌దీసినంత ప‌నిచేశారు.

మొత్తంగా న‌గ‌దు కొర‌తకు కేంద్ర‌మే కార‌ణ‌మ‌ని కూడా తేల్చేసిన చందంగా లోకేశ్ వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న వినిపించింది. అయితే జ‌నంతో పాటు లోకేశ్ - చంద్ర‌బాబులు మ‌రిచిపోయిన విష‌యాన్ని బ‌య‌ట‌కు లాగిన ఏపీ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు - మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి... వారిద్ద‌రిని అడ్డంగానే బుక్ చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌స్య‌ల ప‌రిష్కార క‌మిటీ చైర్మ‌న్‌ గా ఉన్న విష‌యాన్ని మ‌రిచిపోయిన చంద్ర‌బాబు... క‌రెన్సీ కొర‌త‌ను కేంద్రంపై నెట్టేస్తే స‌రిపోద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా క‌రెన్సీ కొర‌త‌కు నిర‌స‌న‌గా ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులు - ఏటీఎంల వద్ద నిర‌స‌న తెల‌పనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏపీలో న‌గ‌దు కోర‌త తీవ్రంగా ఉంద‌ని - ఏటీఎంలలో డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు సీఎం చంద్ర‌బాబుకు క‌నిసించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. న‌గ‌దు కోర‌తతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతుంటే ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌లు ఏమిట‌ని డిమాండ్ చేశారు. పెద్ద‌నోట్లు ర‌ద్దును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు ప‌రిష్కార క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉన్న విష‌యం మ‌ర్చిపోయారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించాల‌ని ర‌ఘువీరారెడ్డి సూచించారు. మొత్తంగా జ‌నానికి గుర్తు లేని విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన ర‌ఘువీరా... చంద్ర‌బాబుతో పాటు లోకేశ్ ను కూడా అడ్డంగా బుక్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.