Begin typing your search above and press return to search.

రాఫెల్ గ‌ 'లీజ్' డీల్ ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:45 AM GMT
రాఫెల్ గ‌ లీజ్ డీల్ ఇదేన‌ట‌!
X
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ఇప్పుడు మోడీ ప్ర‌భుత్వానికి పెద్ద గుదిబండ‌లా మారిన సంగ‌తి తెలిసిందే. త‌మ ప్ర‌భుత్వ‌మంత నీతి.. నిజాయితీ మ‌రెవ‌రిలోనూ ఉండ‌ద‌న్న బిల్డ‌ప్ ఇచ్చిన మోడీ స‌ర్కారు వ్య‌వ‌హారం నేతి బీర‌లో నెయ్యి చందమ‌న్న విష‌యంపై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ రాఫెల్ గురించి ప‌లువురు మాట్లాడింది ఒక ఎత్తు అయితే.. ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హౌలాండ్ ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ పుణ్య‌మా అని.. మోడీ స‌ర్కారు చేసుకున్న రాఫెల్ డీల్ మీద ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అభిప్రాయం స్థానే.. కొత్త త‌ర‌హా కారు మబ్బులు ముసురుకున్న ప‌రిస్థితి.

మిగిలిన ప్ర‌భుత్వాల‌కు భిన్న‌మైన‌దేమీ కాదు మోడీ స‌ర్కారు అన్న విష‌యాన్ని రూ.59వేల కోట్ల విలువైన ర‌క్ష‌ణ ఒప్పందం తాజాగా తేల్చింద‌ని చెప్పాలి. దేశ భ‌ద్ర‌త ఎంతో కీల‌క‌మైన రాఫెల్ మీద ఉండే సందేహాల్ని మ‌న‌సులో పెట్టుకోండే త‌ప్పించి.. మాట వ‌ర‌స‌కైనా బ‌య‌ట‌కు తెచ్చినా.. ప్ర‌స్తావించినా భారీ.. దేశ ద్రోహానికి పాల్ప‌డినట్లుగా క‌ల‌ర్ ఇచ్చిన క‌మ‌ల‌నాథులు ఇప్పుడు కామ్ అయిన ప‌రిస్థితి.

హౌలాండ్ మాట‌ల‌కు కౌంట‌ర్ అంటూ ఇచ్చినోళ్లే క‌నిపించ‌లేదు. ఎప్ప‌టిలానే.. త‌న‌దైన వాద‌న‌తో త‌మ మీద ప‌డిన రాఫెల్ డీల్ మ‌ర‌క‌ల్ని తుడుచుకునే ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌. తాజా ప‌రిణామాల్ని ప‌రిశీలించిన‌ప్పుడు.. నిర్మ‌ల‌మ్మ‌కు ముందున్న పారీక‌ర్ ను గోవా ముఖ్య‌మంత్రిగా పంప‌టానికి రాఫెల్ ఏమైనా కార‌ణ‌మా అన్న కొత్త సందేహం ఇప్పుడు క‌లిగే ప‌రిస్థితి.

ఇంత‌కీ.. ఈ రాఫెల్ యుద్ధ విమానాల వ్య‌వ‌హారం ఎప్పుడు మొద‌లైంది..? మోడీ హ‌యాంలో ఏం జ‌రిగింది? అంబానీ ఎంట్రీ ఎందుకు వ‌చ్చింది? ఆయ‌న చేసిన ఫేవ‌ర్ ఏమిటి? అన్న విష‌యాల్ని 5 పాయింట్ల‌లో చెప్పేస్తే...

1. 2007లో రాఫెల్ వ్య‌వ‌హారం మొద‌లైంది. వైమానిక ద‌ళం కోరిక మేర‌కు 126 మీడియా మ‌ల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలుకు యూపీఏ స‌ర్కారు ఓకే చేసింది. ఈ టెండ‌ర్ల‌ను రాఫెల్ యుద్ధ విమానాల్ని త‌యారు చేసే ద‌సాల్ట్ ఏవియేష‌న్ కు అప్ప‌జెప్పింది. ఇందులో భాగంగా 18 విమానాల‌ను ఫ్రాన్స్ లోనే త‌యారు చేయాలి. మిగిలిన విమానాల్ని భార‌త్ లోని హాల్ (హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) తో క‌లిసి సంయుక్తంగాత‌యారు చేస్తారు. ఒప్పందం ఒక ద‌శ‌కు వ‌చ్చినా.. యూపీఏ స‌ర్కారు 2 కాల‌ప‌రిమితి ముగియటంతో ఈ ఒప్పందం పూర్తి కాలేదు. చివ‌ర‌కు వ‌చ్చి ఆగింది.

2. 2015 ఏప్రిల్ లో ప్ర‌ధాని మోడీ ఫ్రాన్స్ లో ప‌ర్య‌టించారు. ఆ సంద‌ర్భంలో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు హోలాండ్ తో మీటింగ్ జ‌రిగింది. త‌క్ష‌ణ‌మే ఉప‌యోగించుకునేలా 36 రాఫెల్ జెట్ ఫైట‌ర్ల‌ను స‌మ‌కూర్చుకుఉంటున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. యూపీఏ హ‌యాంలో జ‌రిగిన చ‌ర్చ‌ల ప్ర‌కార‌మే అంతా జ‌రుగుతుందన్న ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇంత క్లియ‌ర్ గా ప్ర‌క‌ట‌న ఉన్నా.. లోతుల్లోకి వెళితే.. రెండు అంశాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో మొద‌టిది ధ‌ర అమాంతం పెర‌గ‌టం ఒక‌టైతే.. రెండోది హాల్ తో కాకుండా రిల‌య‌న్స్ డిఫెన్స్ తో ఒప్పందం. ఈ రెండు అంశాల్ని ఎక్క‌డా బ‌య‌ట పెట్ట‌లేదు. యూపీఏ హ‌యాంలో జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం ఒక్కో విమానం విలువ రూ.526 కోట్లు అయితే.. మోడీ స‌ర్కారు మాత్రం రూ.వెయ్యి కోట్ల‌కు పైనే అన్నా ఓకే చేసింది.మొత్తంగా రూ.59వేల కోట్ల డీల్ కుదిరింది. దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌న్న ఉద్దేశంతో డీల్ వివ‌రాల్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు.

3. రాఫెల్ ఒప్పందంపై తుది నిర్ణ‌యానికి సంబంధించిన అంశాల్ని ఫైన‌ల్ చేసే ముందు.. ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న‌కు మోడీ వెళ్ల‌టం తెలిసిందే. మోడీ ప్ర‌యాణానికి స‌రిగ్గా 12 రోజుల ముందు రిల‌య‌న్స్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటైంది. కేవ‌లం ల‌క్ష‌ల రూపాయిల పెయిడ‌ప్ క్యాపిట‌ల్ తో.. ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల రంగంలోకి రిల‌య‌న్స్ డిఫెన్స్ దిగింది. ఎలాంటి ర‌క్ష‌ణ అనుభ‌వం లేకున్నా.. ద‌సాల్ట్ లాంటి సంస్థ‌తో వాణిజ్య ఒప్పందం చేసుకునే స్థాయికి కేవ‌లం 12 రోజుల వ్యాపార అనుభ‌వంతో తెర మీద‌కు వ‌చ్చింది.

4. రాఫెల్ ఒప్పందం అయిపోయిన త‌ర్వాత 2016 గ‌ణ‌తంత్ర వేడుకుల‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్య‌క్షుడి హోదాలో హోలాండ్ భార‌త్ కు వ‌చ్చారు. అదే స‌మ‌యంలో హోలాండ్ స‌తీమ‌ణి జూలీ గేట్ కు చెందిన రోగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సినీ నిర్మాణ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వారు తీస్తున్న ‘టౌట్‌ లా-హాట్‌’ సినిమాకు ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఎవ‌రెస్ట్ ను అధిరోహిస్తూ చ‌నిపోయిన యువ సాహ‌సి కెవ్ ఆడ‌మ్స్ స్ఫూర్తితో నిర్మించిన చిత్రం. ఈ ప్రాజెక్టు ఆర్థిక క‌ష్టాల‌తో ఆగింది. రూ.90 (మ‌న రూపాయిల్లో సుమారు) కోట్ల బ‌డ్జెట్ అయిన ఈ చిత్రానికి 30 ల‌క్ష‌ల యూరోలు ఫైనాన్స్ చేస్తాన‌ని చెప్పి.. 16ల‌క్ష‌ల యూరోలు సాయం చేసింది. అప్ప‌టివ‌ర‌కూ క‌ద‌ల‌ని ఈ సినిమా అంబానీ ఫైనాన్స్ తో సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాఫెల్ డీల్ కు..రిల‌య‌న్స్ డిఫెన్స్ కు.. మ‌ధ్య సంబంధం.. దానికి హోండా స‌తీమ‌ణి తీసిన సినిమాకు రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్‌కు ఉన్న అనుబంధం మీద మీడియా పార్ట్ ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌తో మాజీ దేశాధ్య‌క్షుడి నోటి నుంచి వ‌చ్చిన వివ‌ర‌ణ కొత్త సంచ‌ల‌నంగా మారి.. మోడీ స‌ర్కారును పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెట్టిన‌ట్లైంది. త‌న భార్య తీసిన సినిమాకు.. రాఫెల్ డీల్ కు సంబంధం లేద‌ని హోండా తేల్చినా.. అర్థం కావాల్సిందంతా అంద‌రికి అర్థ‌మైంది.

5. రాఫెల్ డీల్ ను ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన హాల్ స్థానే ఎలాంటి అనుభ‌వం లేని అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ డిఫెన్స్ కు ఇవ్వ‌టం ఒక సందేహ‌మైతే.. ఎప్పుడైతే హోలాండ్ స‌తీమ‌ణి సినిమాకు అంబానీకి చెందిన మ‌రో సంస్త రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఫైనాన్స్ చేసిందో.. చిక్కుముడులు వీడిపోవ‌టమే కాదు.. ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు చెప్పిన‌ట్లుగా.. మోడీ స‌ర్కారు కోరినందునే హాల్ స్థానే రిల‌య‌న్స్ డిఫెన్స్ తో ఒప్పందం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ మొత్తం జ‌రిగిన విష‌యాల్ని చూస్తే.. విమానం ధ‌ర‌ను బాగా పెంచేద్దాం.. వివ‌రాలు అడిగే వారికి దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌య‌మ‌ని నోరు మూయిద్దాం.. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ గా అబానీ సంస్థ‌ను ఎంపిక చేయ‌టం ద్వారా.. ఫ్రాన్స్ దేశాధ్య‌క్షుడి స‌తీమ‌ణి సినిమాకున్న ఆర్థిక క‌ష్టాల్ని తీర్చ‌టం.. ప‌నిలోప‌నిగా భారీగా మిగిలే డ‌బ్బులు పంచుకుందామ‌న్న‌ట్లుగా డీల్ కుదిరిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో భారీగా ప్ర‌చారం సాగుతోంది.