Begin typing your search above and press return to search.

రాఫెల్.... ఇప్పుడు హాట్ గురూ....

By:  Tupaki Desk   |   22 Sep 2018 5:10 PM GMT
రాఫెల్.... ఇప్పుడు హాట్ గురూ....
X
రాఫెల్. దేశంలో ఇదో పెద్ద టాపిక్. దేశ రక్షణ రంగానికి యుద్ధ విమానాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చిన ఫ్రాన్స్ కంపెనీ. ఈ కంపెనీతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రోజుకో మలుపు తిరుగుతూ దేశంలో రాజకీయ వేడిని పుట్టిస్తోంది. అధికార భారతీయ జనతా పార్టీకి - ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య రాఫెల్ మాటల్ మంటలు రేపుతున్నాయి. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన తాజా వ్యాఖ్యలు భారత్ మరింత మంటలను ఉద్రతం చేశాయి. 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు అప్పటి ఆ దేశ అధ్యక్షుడు హోలాండేతో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ కుదుర్చుకున్నారని ఆయనే స్వయంగా ప్రకటించారు. భారత్‌ కు యుద్ద విమానాలు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్న సంస్ధకు భాగస్వామ్య సంస్ధగా రియలన్స్ డిఫెన్స్‌ తో డీల్ కుదిరేలా భారత ప్రభుత్వమే తమను ఒప్పించిందని హోలాండే ఫ్రాన్స్ పత్రిక మీడియా కు వెల్లడించారు. ఇది ఫ్రాన్స్‌ లోనే కాదు...భారత్ లో తీవ్ర ప్రకంపనలు స్రష్టిస్తోంది. హోలాండే భార్యకు మేలు చేసేందుకు రిలయన్స్ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నారని వెల్లడైంది. ఇది కాంగ్రెస్ పార్టీకి తాజాగా దొరికిన ఆయుధం.

అయితే తమ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన ప్రకటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు తన ప్రయత్నాలను ప్రారంభించింది. హోలాండే చెప్పిన అంశాలతో తమకు సంబంధం లేదని - తమ కంపెనీలు ఎవరితో ఒప్పందం చేసుకోవాలో అది వారి ఇష్టమేనని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. రాఫెల్ యుద్ధ విమానాల అంశంలో భారత ప్రభుత్వానికీ - ఫ్రాన్స్ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కొత్తగా దొరికిన ఆయుధం. మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ - ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన ప్రకటనతో భారతీయ జనతా పార్టీ పరస్పర యుద్ధ ప్రకటనలు చేసుకుంటున్నాయి. మొత్తానికి రాఫెల్ యుద్ధ విమానాల అంశం దేశాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కంపెనీ డసో ఏవియేషన్ కూడా తమ భాగస్వామ్య సంస్ధపై నిర్ణయాలు తమదే అని తేల్చి చెప్పింది. ఈ కంపెనీ సీఈవో ఎరికి ట్రాపిరియర్ ఫ్రాన్స్‌లో ఓ ప్రకటన విడుదల చేస్తూ ఇది పూర్తిగా తమ కంపెనీకి సంబంధించిన అంశమే అని స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం, బిజేపీ పెద్దలు ఆడిస్తున్న నాటకమేనని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మొత్తానికి దేశ రాజకీయం ఇప్పుడు రసకందాయంలో పడింది. బోఫోర్సు ఒప్పందంతో ఆనాడు రాజీవ్ గాంధీ పదవి కోల్పోయారు. మరి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుతో ఎవరు ఏమవుతారో భవిష్యత్తే తేల్చాలి.