Begin typing your search above and press return to search.

రాధేమాకు మ‌ర్యాద చేసి అడ్డంగా బుక్‌

By:  Tupaki Desk   |   5 Oct 2017 7:58 AM GMT
రాధేమాకు మ‌ర్యాద చేసి అడ్డంగా బుక్‌
X
వివాదాస్ప‌ద ట్రాక్ రికార్డు ఉన్న స్వామీజీలు.. బాబాలు.. మాత‌లు త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే అధికారులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఆ మ‌ధ్య వ‌రుస వివాదాల్లో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కిన రాధేమా తాజాగా మ‌రో ఉదంతంలో ఆమె పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తాజాగా ఆమె ఒక పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ద‌క్కిన వీవీఐపీ ట్రీట్ మెంట్ చూసినోళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. త‌న వివాదాస్ప‌ద తీరుతో ఇప్ప‌టికే కేసులు ఎదుర్కొంటున్న ఆమెకు ఒక పోలీసు అధికారి ఇచ్చిన వీఐపీ ట్రీట్ మెంట్ పై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ద‌క్షిణ ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేష‌న్‌ కు రాధేమా వెళ్లారు.

త‌న స్టేష‌న్‌ కు వ‌చ్చిన రాధేమాను చూసిన స‌ద‌రు అధికారి ఉబ్బిత‌బ్బుబ్బిపోయి ఆమెకు విప‌రీతంగా సేవ‌లు చేశారు. వీవీపీ వ‌చ్చిన‌ట్లుగా ఫీల్ కావ‌ట‌మే కాదు.. ఆమెను త‌న కుర్చీలో కూర్చోబెట్టి మ‌ర్యాద‌లు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వివాదాస్ప‌ద మాత‌గా పేరున్న రాధేమాకు ఇంత మ‌ర్యాద ఇవ్వ‌టం ఏమిటంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో ఉన్న‌తాధికారులు అలెర్ట్ అయ్యారు.

స్టేష‌న్లో త‌న కుర్చీలో కూర్చోబెట్టిన స‌ద‌రు పోలీసు అధికారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో తాము త్వ‌ర‌లోనే తేలుస్తామంటూ ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. మోడ్ర‌న్ డ్రెస్సుల‌తోనూ.. త‌న వ్య‌వ‌హార‌శైలితోనూ ఇప్ప‌టికే ప‌లు వివాదాల్లోకి రాధేమా చిక్కుకోవ‌టం తెలిసిందే. ఆ మ‌ధ్య గృహ‌హింస కేసును సైతం ఆమె ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే.