Begin typing your search above and press return to search.

యాంక‌ర్ ఏడుపు వైర‌ల్‌..ట్రంప్ నిర్ణ‌యం వెన‌క్కు

By:  Tupaki Desk   |   21 Jun 2018 2:31 PM GMT
యాంక‌ర్ ఏడుపు వైర‌ల్‌..ట్రంప్ నిర్ణ‌యం వెన‌క్కు
X
మెక్సికో నుంచి అక్రమంగా సరిహద్దులు దాటుతున్న వారికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందేదా. ఇలా వచ్చిన వాళ్లలో తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి వాళ్లను టెండర్ ఏజ్ షెల్టర్లకు పంపిస్తున్నారు. తమ తల్లిదండ్రులు కనిపించక ఆ పిల్లలు తెగ ఏడుస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు సంబంధించిన ఆడియో క్లిప్పులు వైరల్‌గా మారాయి. ఓ రెండేళ్ల చిన్నారి ఏడుస్తున్న ఫొటో కూడా ప్రపంచాన్ని ఎంతలా కలిచి వేసిందో మనం చూశాం. అయితే ఈ వార్త చదువుతున్న సమయంలో ఓ టీవీ యాంకర్ భావోద్వేగానికి గురైంది. లైవ్‌లోనే ఆ వార్త చదవలేక ఏడ్చేసింది. ఎంఎస్ఎన్‌బీ చానెల్‌కు చెందిన యాంకర్ రేచల్ మాడో ఇప్పుడే అందిన వార్త అంటూ ఆ న్యూస్ చదవబోయి కంటతడి పెట్టింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారిపోయింది.

మెక్సికో, అమెరికా సరిహద్దులో ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా టెండర్ ఏజ్ షెల్టర్లను ఏర్పాటు చేసి అక్రమంగా వలస వచ్చే వారి పిల్లలను అక్కడికి తరలిస్తున్నది. అభంశుభం తెలియని ఆ చిన్నారులు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లలేక ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ దారుణాలను సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రంప్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ న్యూస్ యాంకర్ ఏడుస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది. తనను తాను నియంత్రించుకోలేకపోయినట్లు ఆమె తెలిపింది. ట్విటర్‌లో ఆమెకు మద్దతుగా ఎంతోమంటి ట్వీట్లు చేస్తున్నారు.

మెక్సికో సరిహద్దులో సాగుతున్న కుటుంబాల ఎడబాటును ఆపాలని ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన తండ్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించినట్టు సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థలు తెలిపాయి. ఇవాంకా నుంచి ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడనప్పటికీ రిపబ్లికన్ సభ్యులతో సమావేశం సందర్భంగా తన కుమార్తె వ్యాఖ్యలను ట్రంప్ వివరించినట్టు ఆ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కుటుంబాల ఎడబాటు సందర్భంగా పిల్లల హృదయ విదారకమైన ఏడ్పులకు సంబంధించిన దృశ్యాలను తాను చూశానని, ఈ సంక్షోభాన్ని వెంటనే ముగించాలని ఇవాంకా తనను కోరినట్టు ట్రంప్ తెలిపారు. తాను కూడా ఆ దృశ్యాలను చూశానని, అవి ఎంతో బాధాకరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒక చట్టపరమైన పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని చెప్పారు.

ఇలా అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి వస్తున్న కుటుంబాలను అరెస్టు చేసి తల్లిదండ్రులను, పిల్లలను వేరుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధ్యక్షుడు ట్రంప్ తన మనస్సు మార్చుకున్నారు. అక్రమ వలసదారుల కుటుంబాలను విడదీసి తల్లిదండ్రులను, పిల్లలను వేరుచేయకుండా అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై కుటుంబాలను కలిపే ఉంచుతామని చెప్పారు.