Begin typing your search above and press return to search.

హోటల్ వెయిటర్.. మెడల్ జస్ట్ మిస్!

By:  Tupaki Desk   |   26 Aug 2016 1:24 PM GMT
హోటల్ వెయిటర్.. మెడల్ జస్ట్ మిస్!
X
ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ లో భారత్ రెండు పతకాలు సాధించింది. వాటిలో ఒకటి పీవీ సింధు తెచ్చిన రజతం కాగా రెజ్లర్ సాక్షి మాలిక్ తీసుకొచ్చిన కాంస్యం. అయితే ఈ రెండు పతకాలు ఒలింపిక్స్ లో భారత పరువును నిలబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీటితో పాటు మరో రెండు పతకాలు తృటిలో తప్పాయి. వీటిలో తృటిలో పతకం కోల్పోయిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కాగా మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చిన మనీష్ సింగ్ రావత్.

మీడియా ఫోకస్ ఈ విభాగంపై తక్కువగా ఉండటం వల్లో ఏమోకానీ.. రియో రేస్ వాకింగ్ లో భారత అథ్లెట్ మనీష్ సింగ్ రావత్ ప్రదర్శన వెలుగులోకి పూర్తిగా రాలేదు కానీ.. అతని ప్రదర్శన చాలా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే... రేస్ వాకింగ్ ఫైనల్లో 20 కిలో మీటర్ల వాకింగ్ ను ఒక గంటా 20 నిమిషాల 21 సెకెండ్లలో పూర్తి చేసిన మనీష్ 13వ స్థానంలో నిలిచాడు. 13వ స్థానమే కథా అని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే.. కాంస్య పతకం సాధించే క్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నమోదు చేసిన సమయం కంటే ఇది కేవలం ఒక్క నిమిషమే తక్కువ. అంటే.. భారత్ కు రాబోయే మరో పతకాన్ని ఆ ఒక్క నిమిషం మింగేసిందన్నమాట. దీంతో ఈ మనీష్ సింగ్ రావత్ ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాగర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ మనీష్ సింగ్ రావత్. ఒక పేద కుటుంబంలో పుట్టిన మనీష్ పరిస్థితికి తోడు తన తండ్రి కూడా చిన్నతనంలోనే చనిపోయాడు. దీంతో చిన్నతనంలోనే అతడిని పెద్ద పెద్ద కష్టాలు పలకరించాయి. దాంతో కుటుంబాన్ని పోషించడానికి వెయిటర్ అవతారం ఎత్తాడు మనీష్ సింగ్. బద్రినాథ్ లోని ఒక హోటల్ లో వెయిటర్ గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి కల అయిన రేస్ వాకర్ గా సత్తాచాటాలనే బలమైన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తెల్లవారుజామునే నిద్రలేచి ప్రాక్టీస్ చేసేవాడట. వాకింగ్ చేయడంతో పాటు, వెయిటర్ గా డ్యూటీ కూడా చేసుకునేవాడు. అలా రేస్ వాక్ ను ప్రారంభించిన మనీష్ జాతీయ అథ్లెట్ గా ఎదిగాడు. అనంతరం బీజింగ్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ అథ్లెటిక్స్ లో సత్తా చాటుకుని రియోకు అర్హత సాధించాడు. ఒక హోటల్ వెయిటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రియో ఒలింపిక్స్ వరకూ వెళ్లడం గొప్ప, ఆదర్శం కాదంటారా?