Begin typing your search above and press return to search.

సమ్మె ముగిసే వేళ..సారు నుంచి స్పందన నిల్

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:41 AM GMT
సమ్మె ముగిసే వేళ..సారు నుంచి స్పందన నిల్
X
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తో పాటు మరిన్ని సమస్యల్ని పరిష్కరించాలంటూ పదకొండు రోజుల క్రితం మొదలైన కార్మికుల సమ్మె.. ఈ రోజుతో ముగుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతకంతకూ పెరుగుతున్న సమ్మెకు చెక్ పెట్టేలా సోమవారం కేకే తెర మీదకు వచ్చి.. చర్చలకు వస్తే ప్రభుత్వంతో మాట్లాడొచ్చన్న మాటతో పాటు.. తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పటంతో ఉభయుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడినట్లేనన్న భావన కలిగింది.

కేకే నుంచి వచ్చిన ఆఫర్ కు ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కూడా సానుకూలంగా స్పందించటమే కాదు.. చర్చలకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు. దీంతో.. సమ్మె క్లోజ్ చేసేలా కేకే సీన్లోకి వచ్చినట్లుగా భావించారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కార్మికులకు మరింత కాలిపోయేలా చేసింది. దీంతో.. పదకొండో రోజున తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున సమ్మెలు..ఆందోళనలు.. నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.

పలు చోట్ల పోలీసులకు.. ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ రోజు (మంగళవారం) సమ్మె నేపథ్యంలో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒకటి ఆర్టీసీ ఉద్యోగులకు గత నెలలో పని చేసిన దానికి జీతాలు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించాలన్నది ఒకటైతే.. మరొకటి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించటాన్ని సవాల్ చేస్తే అఖిల్ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేవారు.

ఆర్టీసీలో పని చేస్తున్న 49,190 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు రాజధాని హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. కరీంనగర్.. సంగారెడ్డిలలో చోటు చేసుకున్న నిరసన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులతో కలిసి బీజేపీ ఎంపీ బండి సంజయ్.. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను వాహనంలో తరలించే ప్రయత్నంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సందర్భంలో ఏసీపీ కింద పడిపోయారు.

వందల మీటర్లు పోలీసుల వాహనాలకు కార్యకర్తలు అడ్డుతగిలారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు.. న్యాయంగా నిరసన చేస్తే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిపోతుందన్న సమయంలో కలుగజేసుకున్న సంజయ్.. కార్యకర్తలకు సర్దిచెప్పటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్ల మీద రాస్తారోకోను నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. సంగారెడ్డిలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆందోళనలకు సిద్ధమైన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంపై ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇవే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో పాటు విపక్షాలు పలు చోట్ల నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కేకే చొరవతో చోటు చేసుకున్న సానుకూల వాతావరణం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంతో పరిస్థితి మారిందంటున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్న వేళ..సమ్మెను ఒక కొలిక్కి తెచ్చే అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించకపోవటాన్ని తప్పు పడుతున్నారు.