రాజ్యాంగాన్ని సవరించాలంటున్న మతపెద్దలు

Thu Sep 14 2017 07:00:01 GMT+0530 (IST)

``జాతీయ నాయకులు భారతీయ సంస్కృతి అనే భావనను తాము అర్థం చేసుకున్న విధంగానే రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ అది సరిగాలేదు. అందులో చాలా విషయాలు విదేశీ జీవన విధానాన్ని - వారి ఆలోచనలను ప్రతిబింబించేవిగానే ఉండిపోయాయి. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలవుతోంది. ఇప్పటికైనా దీనిపై చర్చించాలి. ఈ లోపాన్ని సరిచేయాలి``  రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలివి. మన సంస్కృతికి అనుగుణంగానే న్యాయవ్యవస్థ కూడా ఉండాలని ఆయన సూచించడం గమనార్హం. దీంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మరోసారి రాజ్యాంగంపై గురిపెట్టిందనే చర్చ సాగుతోంది.

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల కారణంగా మరోమారు సంఘ్ మార్క్ రాజకీయం...రాజ్యంగ సవరణ తెరమీదకు వచ్చింది.  దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని కోరుకునే ఆర్ ఎస్ ఎస్.. భారత రాజ్యాంగాన్ని లక్ష్యంగా చేసుకోవటం ఇది తొలిసారి కాదు. మొదట్లో ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్నే గుర్తించడానికి నిరాకరించడమేగాక దానిని తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. ప్రాచీన హిందూ ధర్మశాస్త్రమైన మనుస్మృతిని రాజ్యాంగం అనుసరించకపోవటమే ఆరెస్సెస్ వ్యతిరేకతకు కారణమని పలు సందర్భాల్లో నేతలు చేసిన వ్యాఖ్యల వల్ల వెల్లడయ్యింది. చాతుర్వర్ణ వ్యవస్థను - అంటరానితనాన్ని భారతావనిలో అమలుపరిచి - ఇప్పటికీ అమలుపరుస్తున్న మనుస్మృతిపై అభిమానాన్ని ఆరెస్సెస్ ఏనాడూ దాచుకోలేదు. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు 1949 నవంబర్ 30న ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్ తన ఎడిటోరియల్ లో ఇదే విషయాన్ని స్పష్టంచేసింది కూడా. ప్రాచీన భారతావనిలో ప్రత్యేకంగా అమలైన రాజ్యధర్మం మన రాజ్యాంగంలో లోపించింది. మనుస్మృతిలో పేర్కొన్న అంశాలు ఈరోజుకీ అనుసరణీయంగా ఉండడాన్ని ప్రపంచం ప్రశంసిస్తున్నది. కానీ మన రాజ్యాంగ పండితులకు అవంటే లెక్కేలేదు అని పేర్కొంది.

1950 ఫిబ్రవరి 6న ఆర్గనైజర్ పత్రిక ఓ వ్యాసాన్ని ప్రచురించింది. మా గుండెలనిండా మనుధర్మం అన్న శీర్షికన శంకర్ సుబ్బాఅయ్యర్ అనే రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి రాసిన ఆ వ్యాసంలో... హిందువులుగా తాము భారత రాజ్యాంగానికన్నా మనుస్మృతికే కట్టుబడి ఉంటామని దానినే ఆచరిస్తామని పేర్కొన్నారు. మనుధర్మశాస్ర్తానికి కాలం చెల్లిందని మనుస్మృతికానీ మరే స్మృతికానీ నిర్దేశించిన విధంగా ఇకపై భారత ప్రజలు తమ రోజువారీ జీవితాల్ని గడపాల్సిన అవసరం లేదని ఇటీవల బొంబాయిలో అంబేద్కర్ ప్రకటించారు. కానీ సంప్రదాయ హిందువులు స్మృతుల్లో చెప్పిన కొన్ని అంశాలకు ఇప్పటికీ కట్టుబడి ఉంటారు. దాన్ని వదిలిపెట్టి తమను తాము శక్తిహీనులుగా మారేందుకు వారెవరూ సిద్ధంగా లేరు అని ఆ వ్యాసంలో ప్రచురించారు. ఈ విధంగా రాజ్యాంగంపై తన వ్యతిరేకతను తొలినుంచీ బహిరంగంగా వెల్లడిస్తూ వచ్చిన ఆరెస్సెస్.. ప్రస్తుతం కేంద్రంలో పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వం కొలువై ఉన్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని తన ఆకాంక్షలకు అనుగుణంగా మార్చే ప్రయత్నాలను ప్రారంభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతమున్న చట్టసభల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఆరెస్సెస్ ఓ నమూనాను రూపొందించిందని 2000 సంవత్సరంలో ఓ వ్యాసంలో సుబ్రమణ్యస్వామి రాశారు. ఆరెస్సెస్ పరివారానికి చెందినదిగా భావించే ఏబీవీపీ 1998 అక్టోబర్‌లో జరిపిన జాతీయ సదస్సులో ఓ పత్రాన్ని అందరికీ పంపిణీ చేసింది. పార్లమెంటరీ వ్యవస్థలో ద్విసభా విధానానికి బదులుగా త్రిసభ విధానం ఉండాలని అందులో పేర్కొన్నారు. సాధువులు సన్యాసులతో కూడిన గురుసభ అత్యున్నత సభగా ఉండాలని గురుసభకు ఎవరిని ఎన్నిక చేయాలనేది ఎన్నికల కమిషన్ కాకుండా మానవనరుల మంత్రిత్వశాఖ చూడాలని ప్రాథమిక హైస్కూల్ ఉపాధ్యాయులు ఓటేసి గురుసభ సభ్యుల్ని ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. ఈ గురుసభే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని ఖరారు చేస్తుంది. గురుసభకు లోక్‌సభకు మధ్యలో రాజ్యసభకు బదులుగా రక్షాసభ అనేది ఉంటుంది. రక్షాసభలో త్రివిధ దళాధిపతులు రిటైర్డ్ సైనికులు ఉంటారని వారే దేశంలో ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టాలో నిర్ణయిస్తారని ఆ పత్రంలో వివరించారు అని సుబ్రమణ్యస్వామి వెల్లడించారు. సదరుపత్రంలో ఉన్నట్లుగా జరిగితే వాటికన్ తాలిబన్ సంకరీకరణంగా దేశం తయారవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

బంచ్ ఆఫ్ థాట్స్ పేరిట పుస్తకం రాసిన ఆరెస్సెస్ మాజీ అధినేత సిద్ధాంతకర్త గోల్వాల్కర్ అందులో సంఘ్ వైఖరిని స్పష్టంచేశారు. ``పశ్చిమ దేశాలకు చెందిన వివిధ రాజ్యాంగాల నుంచి కొన్ని ముక్కలను తీసుకొచ్చి అన్నింటినీ చేర్చి ఓ రాజ్యాంగాన్ని తయారు చేశారు. కానీ మనది అనుకునేదేదీ భారత రాజ్యాంగంలో వాస్తవానికి లేదు. మన దేశం దేనికోసం ఉద్దేశించిందో మన జీవనలక్ష్యం ఎలా ఉండాలో ఒక్క పదమైనా ఈ రాజ్యాంగంలో ఉందా?`` అని ప్రశ్నించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరైన సావర్కర్ కూడా వేదాల తర్వాత అత్యంత పూజించదగినది మనుస్మృతేనని చెప్పుకొచ్చారు. మొత్తంగా సనాతన భారతీయ సంస్కృతికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలన్న వ్యాఖ్యలు సంఘ్ పరివార్ రహస్య ఎజెండాను స్పష్టంచేస్తున్నాయని దేశాన్ని హిందూరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు మొదలయ్యాయి.