Begin typing your search above and press return to search.

తిరుగులేని ద్వ‌యాన్ని వెంటాడుతున్న‌ అసంతృప్తి క‌త్తి!

By:  Tupaki Desk   |   17 Dec 2018 8:30 AM GMT
తిరుగులేని ద్వ‌యాన్ని వెంటాడుతున్న‌ అసంతృప్తి క‌త్తి!
X
రాజ‌కీయాలకు సినిమాకు పెద్ద తేడా ఉండ‌దు. సినిమాలో ఉన్న‌ట్లుండి ఒక‌దాని వెంట ఒక‌టి చొప్పున స‌మ‌స్య‌లు వ‌చ్చి మీద ప‌డిపోతాయి. ప‌రిస్థితి గ‌డ్డుగా మారుతుంది. అస‌లు ఇన్ని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం సాధ్య‌మేనా? అన్న సందేహం క‌లుగుతుంది. రాజ‌కీయాల్లోనూ అంతే. ఒక‌సారి స‌వాళ్లు రావ‌టం మొద‌లైన త‌ర్వాత‌.. అవి అలా వ‌స్తూనే ఉంటాయి. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చే ఇబ్బందుల‌కు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.

తాజాగా బీజేపీకి అన్నీ తామైన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీషాల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా ఉన్న వారి ప‌రిస్థితి ఇప్పుడు ఏమీ బాగోలేదంటున్నారు. నిన్న‌టివ‌ర‌కూ పార్టీకి బ‌ల‌మ‌న్న వారే.. ఇప్పుడు బ‌ల‌హీనంగా మార‌ట‌మే కాదు.. రేపొద్దున అధికారం చేజారితే అది కేవ‌లం మోడీషాలే కార‌ణమయ్యే ప‌రిస్థితి.

ఇటీవ‌ల వెలువ‌డిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో మోడీషాలు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. తాజా ఓట‌మికి కార‌ణం వారిద్ద‌రేన‌ని నిందించే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. పైకి అంతా బాగున్న‌ట్లుగా క‌నిపించినా.. ఈ ఇరువురిపై పార్టీలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌వ‌ర్ చేతిలో ఉన్న వేళ స‌ర్లేన‌ని స‌ర్దుకుపోతున్న సంఘ్ ప‌రివార్ సైతం మోడీషాల తీరును త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. వారిద్ద‌రి తీరుపై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఐదు రాష్ట్రాల్లో ప‌రాజ‌యం త‌ర్వాత మోడీషాల తీరుపైనా.. వారిద్ద‌రి ఛ‌రిష్మా మీదా పార్టీ పెద్ద‌లు కొత్త త‌ర‌హాలో మ‌దింపు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఫ‌లితాల‌పై పార్టీ సీనియ‌ర్లు అద్వానీ.. ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషిలు అంత‌ర్గంగా స‌మీక్షించుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వారిద్ద‌రూ మోడీషాల బాధితులేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ప‌రాజ‌యానికి కార‌ణాలు తేల్చ‌టంతో పాటు.. త‌ప్పులపై స‌మీక్ష జ‌ర‌గ‌ని తీరుపై పార్టీలో ప‌లువురు అసంతృప్తిలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. రాజ‌కీయాలు వారికి మాత్ర‌మే తెలిసిన‌ట్లుగా మోడీషాలు వ్య‌వ‌హ‌రించ‌టంపై పార్టీ నేత‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఈ అసంతృప్తి జ్వాల వారిద్ద‌రిని ఇబ్బంది పెట్ట‌కున్నా.. రానున్న రోజుల్లో మాత్రం ఇది కొత్త తిప్ప‌లు తీసుకురావ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా చెబుతున్నారు.