Begin typing your search above and press return to search.

బాబు కనిపించ‌ని న‌గ‌రానికి అవినీతి రారాజు

By:  Tupaki Desk   |   11 April 2018 5:18 PM GMT
బాబు కనిపించ‌ని న‌గ‌రానికి అవినీతి రారాజు
X
హ్యాపీ సిటీస్‌... మీడియాకు మేత వేయ‌డంలో బాబును మించిన కాప‌రి లేరు. కోపెన్ హాగ‌న్ వంటి న‌గ‌రాల్లో జ‌ర‌గాల్సిన స‌ద‌స్సుల‌ను టైం కి త‌గ్గ‌ట్టు ప్లాన్ చేసి అస‌లు సిస‌లు ఇష్యూల‌ను మీడియాలో రాకుండా చేయ‌డంలో ఆయ‌న ప్రావీణ్యం చాణ‌క్యుడిని మించిన‌టువంటిది. అయితే, ఇంత‌కాలం ఆయ‌న‌కు అనుకూల మీడియాదే రాజ్యం కావ‌డం వ‌ల్ల‌ బాబు చేసే ఇలాంటి ఆలోచ‌న‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి అవ‌కాశం ఉండేది కాదు - ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తి వ్య‌క్తీ రిపోర్ట‌రే. అందుకే బాబును అడ్డంగా క‌డిగిపారేస్తున్నారు. బాబును ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు. నిజానికి ప్ర‌తిప‌క్షాల కంటే కూడా ఏపీ జ‌న‌మే బాబును ఎక్కువ విమ‌ర్శిస్తార‌ని సోష‌ల్ మీడియాను ఓపెన్ చేస్తే అర్థ‌మ‌వుతుంది.

అపుడెపుడో బీజేపీ షైనింగ్ ఇండియా అంటూ జ‌నం మీద‌కు ఒక పొలిటిక‌ల్ డైలాగ్ వ‌దిలింది. అది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే - చంద్ర‌బాబు ఇపుడు అలాంటి ఆలోచ‌నే చేస్తున్నాడు. *హ్యాపీ సిటీస్ స‌మ్మిట్‌* అని అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు ఒక స‌ద‌స్సు పెట్టారు. మీడియా మేనేజ్ మెంట్ కోసం బాబు ర‌చించిన స్క్రీన్ ప్లే ఇది. లేక‌పోతే ఒక శాశ్వ‌త భ‌వ‌నం లేని అమ‌రావ‌తిలో ఆనంద అమ‌రావ‌తి స‌ద‌స్సు పెట్ట‌డం ఏంటంటూ ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత రోజా చంద్ర‌బాబును క‌డిగేసింది. రాష్ట్రమంతా ప్ర‌త్యేక హోదాకోసం ఉద్య‌మిస్తుంటే... - అనాథ‌లా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోదిస్తుంటే... బాబుకు మాత్ర‌మే ఆనంద అమ‌రావ‌తి క‌నిపించిందా అంటూ ఆమె బాబును విమ‌ర్శించింది. బాబు శాడిజానికి పరాకాష్ట ఆనంద అమరావతి-అది కేవ‌లం ప్రజల ప్రత్యేక హోదా ఉద్యమాన్ని డైవర్ట్ చేయ‌డానికి పెట్టిందేన‌ని ఆమె వ్యాఖ్యానించారు.

అనుభ‌వం ఉంద‌ని అధికారం ఇస్తే బాబు నాలుగేళ్లు నిద్ర‌పోయి... ఈరోజు జ‌నంతో అప్పు తీసుకుని క‌డ‌తాను అంటున్నాడ‌ని - జాతీయ నేత అని చెప్పుకునే చంద్ర‌బాబు 40 ఏళ్ల అనుభ‌వంతో రాష్ట్రానికి ఒక ల‌క్ష కోట్లు కూడా తేలేక‌పోయార‌న్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని తన గేదేలను అక్క‌డ కట్టేస్తానని అంటే, గొడ్ల చావిడికి వ‌దిలేసిన‌ట్టు బాబు వ‌దిలేసిన ఆ ప్రాంతంలో ఆనంద అమ‌రావ‌తి ఎక్క‌డ క‌నిపించింద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఆ ఆనందం బాబుకు తప్ప రాష్ట్రంలో ఎవ‌రికీ క‌నిపించ‌డం లేద‌ని ఆమె వ్యంగాస్త్రం వేశారు.

ఒక్క శాశ్వ‌త భ‌వ‌నం కూడా క‌ట్ట‌ని అమ‌రావ‌తిని స్కాం క్యాపిటల్‌ గా మార్చిన ఘ‌న‌త బాబుదే అని ఆమె అన్నారు. రైతులను బెదిరించి భూములు లాక్కుని వారికి తిరిగి ఇవ్వ‌కుండా బాబు ఏదో పిచ్చి స‌ద‌స్సు పెడితే దానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రావ‌డం విచార‌క‌రం అని ఆమె వ్యాఖ్యానించారు. తెలుగు గడ్డపై పుట్టిన వెంకయ్య ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల ఆకాంక్ష‌ను ప్ర‌తిబింబించ‌డం లేద‌న్నారు. ఏపీకి జ‌రుగతున్న అన్యాయంపై ఆయ‌న ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కాల్‌ మనీ - క్షుద్ర‌పూజ‌లు - భూక‌బ్జాలు - కుంభ‌కోణాలు - దేవాల‌య కూల్చివేత‌లు.... ఇవి బాబు నిర్మించిన రాజ‌ధానికి సాక్ష్యాలని ఆమె విమ‌ర్శించారు.

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై 71 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అంత నమ్మకంగా ఉంటే ఎన్నికలకు వెళదామా అని ఆమె సవాలు విసిరారు. పనిలో పనిగా ఏపీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేశ్‌నూ ఆమె ఎద్దేవా చేశారు. లోకేశ్‌ను విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ‌ అంటూ గాలి తీసేశారు. 13 మంది మంత్రుల పనితీరు అద్భుతమని చంద్రబాబు అంటున్నారని... ఒక్క రోడ్డు కూడా వేయలేని సీఎం కొడుకు విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమకు, విచ్చలవిడిగా బార్లు పెట్టి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ఇతర మంత్రులకే ఈ ప్రశంసలు దక్కాలంటూ ఆమె వెటకారమాడారు.

మరోవైపు అమరావతి నిర్మాణంపైనా ఆమె విమర్శలు కురిపించారు. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సెక్రటేరియట్‌ భవనంలోకి నిళ్లొచ్చాయని గుర్తుచేశారు. నాలుగేళ్లపాటు ఏకపక్షంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇవాళ అఖిలపక్షం భేటీకి పిలిస్తే ఏఒక్కరూ వెళ్లలేదన్నారు.

తమ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే ఈపాటికి కేంద్రం దిగివచ్చేదని.. కానీ చిత్తశుద్దిలేని చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని ఆరోపించారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నందమూరి హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. ఇవాళ తన బినామీ సుజనా చౌదరితో ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ హోదా కోసం కనీసం రెండు కిలోమీటర్లైనా నడవటం సంతోషం అంటూ తనదైన శైలిలో వెటకారమాడారు.

వైసీపీ నేత‌ రోజా వేసిన ప్ర‌శ్న ఈరోజు రాష్ట్రమంతా బాబును అడుగుతోంది. ఆనందం అమ‌రావ‌తిలో ఎక్క‌డుంది? అస‌లు అమ‌రావ‌తి ఎక్క‌డుంది అని అడుగుతున్నారు. అనుభ‌వానికి అధికారమిచ్చి వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తే ఆ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు తెప్పించార‌ని ఏపీ ప్ర‌జ‌లు రోధించే ప‌రిస్థితి నెలకొంది నేడు. చిత్రం కాక‌పోతే... ఏకంగా ఆ పార్టీ ఎంపీ... జేసీ దివాక‌ర్‌రెడ్డి, గ‌త స‌మావేశాల‌కు ఢిల్లీ వెళ్లొచ్చి ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని నిల‌దీయ‌మంటే *మా పెళ్లాల‌ను చూడొద్దా?* అంటూ ప్ర‌శ్నించారంటే... టీడీపీ ఆలోచ‌న ఏంటో జ‌నానికి అర్థం కాకుండా ఉంటుందా?