అధికార పార్టీ ఎమ్మెల్యే అసభ్య డ్యాన్స్ రచ్చ

Thu Oct 12 2017 15:39:49 GMT+0530 (IST)

ప్రజా జీవితంలో ఉన్న నాయకులు వీలైనంత వరకు సంయమనంతో ఉండాలి. అతికి పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అందులోనూ రాజకీయాలు కాక మీద ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోవడం వల్లే...అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు అవస్థల్లో పడిపోయారు. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే...ఓ వీడియో ఆధారంగా సాగుతున్న రచ్చలో ఉన్నది ఖచ్చితంగా సదరు పార్టీ ఎమ్మెల్యే అవునో కాదో తెలియకపోయినప్పటికీ...విపక్షం మాత్రం విరుచుకుపడుతోందిగత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల మధ్య అవినీతిపై పోరు సహా ఇతర అంశాల్లో మాటల యుద్ధం సాగింది. దీంతో ఈ బంధం నుంచి రెండు పార్టీలు దూరమయ్యాయి.  ఆత్మప్రబోధానుసారమే తాను మహాకూటమి నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అయితే అప్పటి నుంచి జేడీయూపై గుర్రుగా ఉన్న ఆర్జేడీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసే వీడియోను బయటపెట్టింది.బీహార్ లోని గయ జిల్లా టికారి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అభయ్ కుమార్ సిన్హాను ఆ రాష్ట్రంలోని విపక్ష పార్టీ అయిన ఆర్జేడీ టార్గెట్ చేసింది. ఎమ్మెల్యేగారి డ్యాన్సులు - అందులో డ్యాన్సర్ ను అసభ్యంగా తాకుతున్న తీరును ఎత్తిచూపించింది. `మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను సైతం కెలికింది.

ఆర్జేడీ అధికారిక అకౌంట్లో పోస్ట్ అయిన ఈ వీడియో....ఎమ్మెల్యే ఎక్కడ - ఎప్పుడు  ఇలా అశ్లీల నృత్యాలు చేశారనేది పేర్కొనలేదు. మరోవైపు ఇందులో ఉన్న ఎమ్మెల్యే  అభయ్ కుమార్ సిన్హా అవునో కాదో కూడా స్పష్టంగా లేదు. అయినప్పటికీ ఆర్జేడీ అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తోంది. ఇది కూడా ముఖ్యమంత్రి గారి ఆత్మప్రబోధానుసారమేనా అంటూ పంచులు పేలుస్తోంది.