Begin typing your search above and press return to search.

ఎన్నికల ముందర బాబును ట్రైలర్ తో గుచ్చిన వర్మ

By:  Tupaki Desk   |   14 Feb 2019 7:20 AM GMT
ఎన్నికల ముందర బాబును ట్రైలర్ తో గుచ్చిన వర్మ
X
ఎన్టీఆర్ బయోపిక్ అంతా పాజిటివ్.. ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం కావడంతో జనాలకు ఇంట్రెస్ట్ పోయింది. అందుకే దానికి ఆదరణ కూడా అంతంతమాత్రంగానే వచ్చింది. జనాలకు పాజిటివ్ కంటే నెగెటివ్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అది సమాజంలోని సహజ ప్రక్రియ. ఈ వివాదాలను క్యాష్ చేసుకోవడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మది అందెవేసిన చేయి. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీస్తున్నారు. ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కంటే దీనిపై అందరి దృష్టి నెలకొంది. వర్మ ఏం చూపిస్తాడన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనుకున్నట్టు వర్మ దుమ్ముదులిపేశాడు.. తాజాగా విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ మొత్తం బాబు చుట్టే తిరిగింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రాక.. దాన్ని ఎన్టీఆర్ కుమారులు, అల్లుడు చంద్రబాబు వ్యతిరేకించడం.. చివరకు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం.. రాజకీయాల్లో ఓడిపోవడం.. చివరకు బాబు చేతిలో మోసపోవడం ఇలా అన్నింటిని కుండబద్దలు కొట్టినట్టు వర్మ చూపించారు. ఈ ట్రైలర్ చంద్రబాబును తీవ్ర ఇరకాటంలో పడేసింది. ట్రైలర్ చివర్లో పల్లు కొరుకుతూ ఎన్టీఆర్ పాత్ర ధారి ‘నేను చేసిన ఒకే ఒక తప్పు వాడిని నమ్మడం’ అని చంద్రబాబు పాత్రను ఉద్దేశించి అనడం సంచలనంగా మారింది..

ప్రజలను ఆకట్టుకునేందుకు పథకాలు,ప్రయోజనాల వెంట పడుతున్న చంద్రబాబుకు ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పెద్ద గుదిబండగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల ముందర ఎన్టీఆర్ ను బాబు ఎలా మోసం చేశాడో పూసగుచ్చినట్టు వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూపిస్తుండడంతో ఈ సినిమా ఖచ్చితంగా బాబు ఇమేజ్ కు కొంతైనా డ్యామేజ్ చేస్తుందని టీడీపీ శ్రేణులు ఆందోళనగా ఉన్నాయి. ఈ సినిమాను ఏపీలో అడ్డుకునేందుకు ప్రయత్నించాలని యోచిస్తున్నాయి. మొత్తంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తాజా ట్రైలర్ లో బాబును టార్గెట్ చేసి వర్మ సంధించిన దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.