Begin typing your search above and press return to search.

జ‌యాన‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు ఎలా?

By:  Tupaki Desk   |   14 Jun 2018 5:29 AM GMT
జ‌యాన‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపు ఎలా?
X
మోడీ బ్యాచ్ మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతోందా? ఒక‌ప్పుడు ఆయ‌న పేరు చెబితేనే ఊగిపోయే ప్ర‌జానీకానికి భిన్నంగా ఇప్పుడు ఆయ‌న పేరు వినిపిస్తేనే మండిప‌డుతున్నారా? మోడీ బ్యాచ్ ఎవ‌రైనా స‌రే.. వారు వ్య‌క్తిగ‌తంగా ఉన్న ఇమేజ్ ను వ‌దిలేసి.. మోడీ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగార‌న్న ఒకే ఒక్క కార‌ణంగా ఓడించేస్తున్నారా? అంటే అవున‌నే చెబుతోంది క‌ర్ణాట‌క‌లో తాజాగా వెలువ‌డిన జ‌యాన‌గ‌ర్ ఫ‌లితం.

బీజేపీ గెలిచేందుకు నూటికి నూరు శాతం అవ‌కాశం ఉన్న చోట‌.. కాంగ్రెస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌టం ఒక సంచ‌ల‌నం అయితే.. ఎందుకిలా జ‌రిగింద‌న్న‌ది క‌మ‌ల‌నాథుల‌కు ఇప్పుడో పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. తాజా ప‌లితాన్ని చూసిన‌ప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని ఆద‌రించిన భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. అయితే.. అది నిజం కాద‌న్న‌ట్లుగా ఇటీవ‌ల వెలువ‌డుతున్న ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ అంతో ఇంతో సానుకూల‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు క‌మ‌ల‌నాథుల మీద ప్ర‌జ‌ల‌కు వెగ‌టు పుట్టేలా చేశాయ‌న్న ఆరోప‌ణ ఉంది. అధికారం కోసం ఎంత‌కైనా తెగిస్తామ‌న్న‌ట్లుగా వారు వ్య‌వ‌హ‌రించిన తీరు భారీ డ్యామేజ్ కు గురి చేశాయ‌న్న‌ది తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

బుధ‌వారం వెలువ‌డిన జ‌యన‌గ‌ర్ ఫ‌లితాన్ని విశ్లేషించిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. నిజానికి జ‌య‌న‌గ‌ర్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. ఎందుకంటే.. గ‌డిచిన రెండుసార్లు బీజేపీకి చెందిన విజ‌య‌కుమార్ ప్రాతినిధ్యం వ‌హించ‌టం ఒక‌టైతే.. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు మృతి చెంద‌టంతో ఈ ఎన్నిక వాయిదా ప‌డింది.

సానుభూతి మెండుగా ఉండే అవ‌కాశంతో ఈ సీటు ఎలాగైనా సొంతం చేసుకోవాల‌న్న ఉద్దేశంతో మ‌రణించిన విజ‌య‌కుమార్ కుమారుడు ప్ర‌హ్లాద్‌ ను బ‌రిలోకి దించారు. స్థానికంగా విజ‌య‌కుమార్ కు మంచిపేరు ఉండ‌టం.. ఆయ‌న మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టంతో సానుభూతితో గెలుపు ప‌క్కా అన్న లెక్క‌లు వేసుకున్నారు బీజేపీ నేత‌లు. దీనికి త‌గ్గ‌ట్లే ఆ పార్టీకి చెందిన నేత‌లు ప‌లువురు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్‌.. జేడీఎస్ బంధం అప‌విత్ర‌మ‌ని.. వారి కూట‌మి స‌రికాద‌న్న తీర్పును త‌మ ఓటుతో ప్ర‌జ‌లు ఇవ్వాలన్న ప్ర‌చారాన్ని చేశారు.భావోద్వేగంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌టానికి ఉన్న అవ‌కాశాల్లో వేటినీ వ‌ద‌ల్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ‌య‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్లు చూస్తే.. ఎక్కువ‌శాతం ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి.. సంప‌న్న వ‌ర్గాల‌కు చెందిన వారు కావ‌టంతో.. బీజేపీకి లాభిస్తుంద‌న్న అంచ‌నాలు వినిపించాయి.

దీంతోనే.. కాంగ్రెస్ సైతం ఈ ఉప ఎన్నిక మీద పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. ప్ర‌చారాన్ని తూతూ మంత్రంగా ముగించారు. బీజేపీకి సానుకూలంగా ఉంటుంద‌న్న అంచ‌నాల‌తో.. పెద్ద‌గా ఆశ‌లు లేని కాంగ్రెస్‌.. త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించామా? అంటే.. దించామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది. చివ‌ర‌కు పేరున్న నేత‌లు ఎవ‌రూ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు రాలేదు.

ఇన్ని సానుకూలాంశాలు ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌క‌పోవ‌టం అంటే.. క‌న్న‌డ ప్ర‌జ‌ల్లో బీజేపీ మీద ఆగ్ర‌హం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అసెంబ్లీకే ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌రో ప‌ది నెల‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి మ‌రెలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు క‌మ‌ల‌నాథుల్లో కొత్త గుబులు రేపుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.