Begin typing your search above and press return to search.

ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరుతారా.?

By:  Tupaki Desk   |   20 Oct 2018 7:33 AM GMT
ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరుతారా.?
X
తెలంగాణలో ప్రస్తుతం ఈ రాజకీయ నాయకుడికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆయనను పార్టీలో చేర్చుకోవాలని చాలా పార్టీలు ఉబలాటపడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో విజయం సాధించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈయన తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే కాదు.. తెలంగాణలో అసంఖ్యాకంగా ఉన్న బీసీ ఓట్లకు ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ వేసిన గాలానికి చిక్కి ఆ పార్టీలో చేరబోతున్నాడట బీసీ నేత - తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య.

కృష్ణయ్య అనాదిగా బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతున్న నేత. ఆయనను ఏ ఒక్క బీసీ కూడా ప్రశ్నించని వ్యక్తిగా పేరొందాడు. ఆయనెప్పుడూ బీసీల గురించే మాట్లాడుతారు. ఈ బలమైన నేతను గడిచిన 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ప్రోత్సహించాడు. అయితే ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిని తెలంగాణలో కోలుకోకపోవడంతో చంద్రబాబు ఈయన్ను మరిచిపోయాడు. ఆర్.కృష్ణయ్యను టీడీపీ కార్యక్రమాల్లోకి పిలవలేదు. ఆదరించలేదు. దీంతో కొన్నేళ్లుగా ఒంటరిగానే మెసులుతున్న ఆయన తాజాగా కాంగ్రెస్ లోకి చేరబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది..

ప్రస్తుతం తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా ఉన్న బీసీల ఓట్లు సంపాదించడంలో ఆర్.కృష్ణయ్య చాలా ఉపయోగపడుతాడని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీలను కాంగ్రెస్ వైపు మళ్లించడంలో ఆర్.కృష్ణయ్య కృషి చేస్తాడని అంచనావేస్తోంది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తాజాగా ఆర్.కృష్ణయ్యతో భేటి అయ్యారు. మరి కృష్ణయ్య కాంగ్రెస్ తో చేతులు కలిపితే ఎన్నికల వేళ ఇది కాంగ్రెస్ కు చాలా లాభమే.. బీసీల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత.. అసంతృప్తి ఆర్.కృష్ణయ్య చేరికతో అధిగమించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎత్తు వేస్తున్నట్లు సమాచారం. అయితే కృష్ణయ్య చేరుతాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే..