Begin typing your search above and press return to search.

టీడీపీ పాపుల‌ర్‌ లీడ‌ర్ సొంత పార్టీ

By:  Tupaki Desk   |   18 May 2017 6:04 AM GMT
టీడీపీ పాపుల‌ర్‌ లీడ‌ర్ సొంత పార్టీ
X
ఇప్ప‌టికే ఉనికి కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ‌కు మ‌రో షాక్ త‌గల‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు పరోక్షంగా స్పష్టం చేశారు. రాజకీయంగా వెనకబాటుతనానికి గురవుతున్న బీసీల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. త‌ద్వారా తెలుగుదేశం పార్టీని వీడబోతున్నట్లు సంకేతమిచ్చారు.

తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల హక్కులను కాపాడుకునేందుకు జిల్లాల వారిగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌.కృష్ణ‌య్య‌ తెలిపారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది బీసీలతో సభలు నిర్వహించి బీసీల ఐక్యతను చాటుకుంటామన్నారు. చివరగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ - పార్లమెంటులో బీసీలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఒకటి రెండు కులాలకు ఏదో చేసామని చెప్పుకోవడం సరికాదని, బీసీ కులాలన్నింటికీ న్యాయం చేకూర్చడానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఆర్‌.కృష్ణ‌య్య‌ డిమాండ్ చేశారు. గొల్ల, కురుమ, యాదవులకు గొర్రెల యూనిట్లను మంజూరు చేయడమే కాకుండా మత్స్యకారులను ప్రోత్సహించడం అభినందనీయమే అయినా అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించాల్సిన అవరసం ప్రభుత్వంపై ఉందన్నారు.

దేశ జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆర్‌.కృష్ణ‌య్య డిమాండ్ చేశారు. దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం కానీ మెజారిటీ ప్రజలకు ఏ రంగంలోను వాటా లేదని వాపోయారు. దశాబ్దాలుగా అగ్రవర్ణాల పాలకులు బీసీలను అణచివేశారన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చట్టబద్ధ హోదా కల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు దాన్ని రాజ్యసభలో అడ్డుకోవడం శోచనీయమన్నారు. బీసీలు తెగించి పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో గుజ్జర్లు - గుజారాత్‌ లో పటేళ్లు - హర్యానాలో జాట్లు చేసినట్టు ఆందోళనలు చేయాలన్నారు. రాజకీయ పదవుల్లో బీసీలకు 14శాతం దాటలేదని తెలిపారు. కేంద్ర విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లను ప్రస్తుత 27శాతం నుంచి 56శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకూ సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ చట్టాన్ని తేవాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/