Begin typing your search above and press return to search.

పార్టీ మారిన‌ వివేక్ ఏం చెప్పిండు భ‌య్‌!

By:  Tupaki Desk   |   9 Feb 2016 3:53 PM GMT
పార్టీ మారిన‌ వివేక్ ఏం చెప్పిండు భ‌య్‌!
X
కార‌ణం ఏదైనా కానీ పార్టీ మారే సంద‌ర్భంలో నేత‌లు చెప్పే మాట‌లు భ‌లే త‌మాషాగా ఉంటాయి. తాజాగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు షాకిస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన మ‌రో ఎమ్మెల్యే తెలంగాణ అధికార‌ప‌క్షంలోకి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలే కొద్ది. అందులోనూ గ్రేట‌ర్‌ప‌రిధిలో గెలిచిన స్థానాలే ఎక్కువ‌. కేసీఆర్ మొద‌లు పెట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో ప‌లువురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే కారు ఎక్కేయ‌గా.. ఉన్న కొద్ది మందితో సైకిల్‌ భారంగా క‌దిలే ప‌రిస్థితి.

రాజ‌కీయంగా సైకిల్ స్లో అయిన నేప‌థ్యంలో పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో టీటీడీపీ ఘోర ఓట‌మి ప్ర‌భావం ఆ పార్టీ మీద ప‌డుతుంద‌న్న అంచ‌నాల‌ను నిజం చేస్తూ.. ఈ రోజు ఉద‌యం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలో పార్టీలో చేరిపోయారు.

బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట‌లు వింటే కాస్తంత విస్మ‌యం క‌లిగించ‌క మాన‌వు. ప్ర‌జ‌ల తీర్పుకు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంతా ఒక‌వైపుకు వ‌చ్చేసి ఇచ్చిన తీర్పును తాను గౌర‌విస్తున్నాన‌ని.. అందుకే అధికార‌పార్టీలో చేరి కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా వివేక్ పేర్కొన్నారు. ఒక‌వేళ వివేక్ మాట‌లే నిజ‌మ‌నుకుంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న్ను సైకిల్ గుర్తు మీద ఓటేసిన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గెలిపించి.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప‌ని చేయ‌మ‌న్నారు. కానీ.. ఆయ‌న మాత్రం అందుకు భిన్నంగా తాజా తీర్పును మాత్ర‌మే ప‌ట్టించుకుంటాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి ప్ర‌జాతీర్పును గౌర‌విస్తున్న వివేక్‌.. త‌న‌ను గెలిపిస్తూ ప్ర‌జ‌లిచ్చిన తీర్పును ఏం చేస్తారు?