Begin typing your search above and press return to search.

బాబుకు మరో షాక్; వివేక్ వెళ్లిపోయాడు

By:  Tupaki Desk   |   9 Feb 2016 5:51 AM GMT
బాబుకు మరో షాక్; వివేక్ వెళ్లిపోయాడు
X
అనుకున్నదే జరిగింది. గత కొద్దికాలంగా పార్టీ మారే విషయంలో ఊగిసలాటలో ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యే మరొకరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సైకిల్ తో సవారీ సాధ్యం కాదన్న విషయం అర్థమై కారులో దూసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. టీటీడీపీకి కంచుకోట అన్న అభిప్రాయం ఉన్న హైదరాబాద్ మహానగరం ఇంకేమాత్రం అలాంటి పరిస్థితి లేదన్న విషయాన్ని గ్రేటర్ ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేసిన నేపథ్యంలో యువ ఎమ్మెల్యే వివేక్ (కుత్భుల్లాపూర్) పార్టీకి గుడ్ బై చెప్పేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిపోయారు.

గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు అధికారిక టీఆర్ఎస్ లోకి చేరటం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్న సమయంలోనే.. వివేక్ జంప్ కావటం గమనార్హం. రోజురోజుకీ తెలంగాణ అధికారపక్షం బలపడుతున్న ప్రస్తుత తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుకు టీఆర్ఎస్ తోనే సేఫ్ అన్న భావనకు వచ్చిన వివేక్ కారు ఎక్కినట్లుగా చెబుతున్నారు. ఏమైనా తాజా పరిణామాలు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి శరాఘాతంగా మారనున్నాయి.