Begin typing your search above and press return to search.

పాక్ లో అంతే... ఉగ్రదాడిలో పోలీసుల మృతి!

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:37 AM GMT
పాక్ లో అంతే... ఉగ్రదాడిలో పోలీసుల మృతి!
X
ఉగ్రవాద వ్యతిరేక దేశమైన, శాంతికాముక దేశమైన భారత్ పై ఉగ్రవాదులు దాడిచేస్తే ప్రపంచం మొత్తం అయ్యో పాపం అన్నా ఒక అర్ధం ఉంది కానీ... పాకిస్థాన్ లో ఉగ్రవాదులు దాడులు చేస్తే అందులో పెద్ద విషయం ఏముంది? వారూ వారూ కలుసుకుంటారు.. ముద్దులెట్టుకుంటారు.. ఒకరి భద్రతను మరొకరు చూసుకుంటారు.. ఒకరికి కష్టమొస్తే మరొకరు ముందుకొస్తారు.. ఒకరిని ఒకరు వెనకేసుకొస్తారు.. ఆ స్థాయిలో ఉంటుంది పాక్ కి ఉగ్రవాదులకీ ఉన్న సంబందం. ఒక్కమాటలో చెప్పాలంటే... ఉగ్రవాదులంటే వేరే వ్యక్తులు కాదు "పాక్ అప్రకటిత సైన్యం" అనే కామెంట్సూ వినిపిస్తుంటాయి. కానీ పాముకు పాలుపోస్తే అనే పాత మాటను కొత్తగా తీసుకుంటే... ఉగ్రవాదికి బీరు బిర్యానీ పోస్తే... బాంబులు కక్కుతాడు - ఆత్మాహుతి దాడి చేస్తాడు. అదే జరిగింది పాక్ లో!!

పాకిస్తాన్‌ లోని క్వెట్టాలో గల పోలీసుల శిక్షణా శిబిరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారు 59 మందికి పైగా పోలీసులు దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడికోసం ముందుగా వాచ్‌ టవర్‌ సెంట్రీని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు అనంతరం శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పాక్ మీడియా పేర్కొంది.

ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600మంది ఉండగా... భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారని - భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు కొంతమంది శిక్షణా పోలీసులను బందీలుగా చేసుకుని వసతిగృహంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోండగా, మరోపక్క ఉగ్రదాడి నేపథ్యంలో క్వెట్టాలో హై అలర్ట్‌ ప్రకటించారు.

కాగా... ఇప్పటికైనా ఉగ్రవాదుల విషయంలో పాక్ బుద్దితెచ్చుకుని ఆలోచించాలని, వారివల్ల ప్రపంచానికి ఏమి జరుగుతుందనే విషయం కాసేపు పక్కనపెడితే, పెంచిపోషిస్తోన్న పాక్ పైనే వారు దాడిచేస్తున్నారనే విషయం పాక్ గ్రహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడితోనే పాక్ పూర్తిగా మారిపోతుందని - మిత్రదేశాల్తోనూ - అగ్రారాజ్యం తోనూ కలిసి ఉగ్రవాదులను ఏరిపారేస్తుందని ఎవరైనా భావిస్తే... అంతకు మించిన మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వంతో మరొకటి ఉండదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/