Begin typing your search above and press return to search.

మరో ఝలక్: టీడీపీకి అక్కడ అభ్యర్థి మారిపోయినట్టే!

By:  Tupaki Desk   |   21 March 2019 10:51 AM GMT
మరో ఝలక్: టీడీపీకి అక్కడ అభ్యర్థి మారిపోయినట్టే!
X
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి వరస ఝలక్ లు తగులుతూనే ఉన్నాయి. అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాకా కూడా నేతలు బాబుకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. వారి అభ్యర్థిత్వానికి బాబు సానుకూలత చూపినా..అలాంటి వారు కొందరు తెలుగుదేశం పార్టీని వీడుతూ ఉన్నారు.

ఇప్పటికే ఇలాంటి వారు కొందరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ తొలి జాబితాలో అభ్యర్థిగా పేరు వెలువడినా.. శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చేతులు ఎత్తేశారు. తను పోటీలో ఉండటం లేదని ప్రకటించారు. ఆ తర్వాత బాబు బుజ్జగించడంతో బుడ్డా మళ్లీ పోటీలోకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ కథ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు పూతలపట్టులో అదే కథ మరికొంత ముందుకు వెళ్లింది. ఈ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేసింది. అయితే సదరు అభ్యర్థి రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. పోటీకి అయిన రెడీగా లేరని.. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని.. సదరు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఆఫీసును చేరుకున్నారు.

అయితే.. ఆయనపై మాత్రం తెలుగుదేశం పార్టీ నమ్మకం ఉంచలేకపోతోందని సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపుగా రద్దు చేసినట్టే అని - ఇప్పటికే ఆయనకు బీఫారం అందించినప్పటికి ఇప్పుడు మరో అభ్యర్థిని వెదుకుతోందట తెలుగుదేశం పార్టీ. ఒక మహిళా దళిత-క్రిస్టియన్ అభ్యర్థిని పూతలపట్టు నుంచి పోటీ చేయించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.

అయితే పరారీ అనుకున్న అభ్యర్థి మాత్రం.. తను పోటీలో ఉన్నట్టే అని అంటున్నారట. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అక్కడ గందరగోళం అయితే నెలకొని ఉంది. ఎన్నికల వేళ మరీ ఇలా అభ్యర్థులే చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి మాత్రం బహుశా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ప్రథమం ఏమో!