Begin typing your search above and press return to search.

చిన్నమ్మా.. ఆంధ్రోళ్ల మీద ఎందుకంత పగ?

By:  Tupaki Desk   |   30 July 2016 10:30 PM GMT
చిన్నమ్మా.. ఆంధ్రోళ్ల మీద ఎందుకంత పగ?
X
ఎన్టీవోడి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన పురంధేశ్వరిని.. ఆ మహానుభావుడి మీద ఉన్న అభిమానంతో.. ఆమె శక్తి.. సామర్థ్యాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఎంపీని చేశారు గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు. ఆమెకు ప్రత్యర్థిగా బరిలో నిలిచిన డి రామానాయుడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ.. ఎన్టీవోడి కూతుర్ని గెలిపించటం తమ బాధ్యతగా ఫీలయ్యారు నాటి ఓటర్లు. అలా తొలిసారి రాజకీయాల్లో ఘన విజయం సాధించిన పురంధేశ్వరి వెంట.. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనునిత్యం నీడలా ఉండేవారు.

ఎంపీగా తొలిసారి గెలిచిన పురంధేశ్వరి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే.. ఆమెకు బదులుగా వెంకటేశ్వరరావు మాత్రమే మాట్లాడేవారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన భార్యకు అవగాహన లేక చెప్పే మాటలతో లేనిపోని ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో డాక్టర్ గారు (దగ్గుబాటి వెంకటేశ్వరరావును అలా పిలుస్తుంటారు) చాలా జాగ్రత్తగా ఉండేవారు. అయితే.. అదంతా ఆర్నెల్లు కూడా సాగలేదు. తన నియోజకవర్గంలోని విషయాల్ని పురంధేశ్వరే సొంతంగా చూసుకోవటం మొదలు పెట్టటమే కాదు.. అనుభవలేమి అన్న ముద్రను తుడిచేసేందుకు ఆమె విపరీతంగా శ్రమించేవారు. ఆమెలోని శక్తి.. సామర్థ్యాల్ని గుర్తించిన నాటి ప్రధాని మన్మోహన్ ప్రోత్సహించటం ఆమెకు మరింత లాభించింది.

రాజకీయంగా ఎన్టీఆర్ కుమార్తెను ప్రోత్సహించిన మైలేజీ సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో.. వైఎస్ మాటను కాదని మరీ దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర క్యాబినెట్ లో స్థానం కల్పించారని చెబుతారు. అలా క్యాబినెట్ లో చోటు సాధించిన తర్వాత పురంధేశ్వరిని ఎవరూ ఆపలేకపోయారు. భర్త లేకుండా ప్రెస్ మీట్ లో పాల్గొనటానికి సంకోచించిన చిన్నమ్మ తర్వాత ఎంతగా చెలరేగిపోయారో అందరికి తెలిసిందే. పలు అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం తరఫున పాల్గొని ప్రశంసలు అందుకున్నారు.

చిన్నమ్మగా అందరికి సుపరిచితురాలైన దగ్గుబాటి పురంధేశ్వరి మీద తెలుగోళ్లకున్న అభిమానమే వేరు. తొలుత బాపట్ల నుంచి పోటీ చేసిన ఆమె.. తర్వాతి ఎన్నికల్లో ఆమె.. తనకేమాత్రం పరిచయం లేని విశాఖపట్నం నుంచి బరిలోకి దిగారు. విశాఖలో తనకెవరూ తెలీకున్నా.. తాను అందరికి సుపరిచితురాలని.. తన తండ్రి ఎన్టీవోడి ట్యాగ్ లైన్ తనకు అండన్న విషయం ఆ ఎన్నికల్లో ఆమె విజయం మరోసారి నిరూపించింది. ఇలా.. రెండుసార్లు పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించిన ఆంధ్రులకు తర్వాతి కాలంలో ఆమె భారీ బహుమానాన్నే ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో మిగిలిన కాంగ్రెస్ నేతలకు భిన్నంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని నిలదీస్తారని.. విభజన సంగతి కంటే కూడా ఏపీకి నష్టం జరగకుండా చూడాలని ఒత్తిడి తెస్తారని.. ఏపీ ప్రయోజనాల మీద గళం విప్పుతారని చాలామంది ఆశలు పెట్టుకున్నారు.

అందుకు భిన్నంగా ఆమె ఆఆశల్ని.. ఆకాంక్షల్ని పట్టించుకున్నది లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోయారు. తెలుగోడి ఆత్మాభిమానం కోసం గళం విప్పిన ఎన్టీవోడి వారసురాలు ఇంత బేలాగా వ్యవహరించటాన్ని సీమాంధ్రులు సహించలేకపోయారు. కేవలం అధికారమే తప్ప.. తనను నమ్ముకున్న వారి కోసం ఆమె ఎలాంటి త్యాగానికి సిద్ధం కారన్న విషయాన్ని అర్థం చేసుకోవటం వల్లే ఆమె 2014 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఓటమి అంటే తెలియని ఆమెకు ఓటమి రుచిని పరిచయం చేశారు.

చేసిన తప్పునకు తగిన శాస్తి అని చాలామంది ఫీలైన పరిస్థితి. తనను నెత్తిన పెట్టుకున్న ఓటర్లు తనను ఎందుకంతలా తిరస్కరించారన్న ఆత్మవిమర్శ చేసుకుంటే పురంధేశ్వరి అడుగులు మరోలా ఉండేవేమో. కానీ.. ఉన్నపార్టీలో విధేయతను ప్రదర్శించటమే తప్పించి.. నమ్ముకున్న ప్రజల తరఫున గళం విప్పటం తనకు చేతకాదన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో ఆమె తరచూ చెబుతున్నారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదాకు ఐదేళ్లు కాదు పదేళ్లు అన్న హామీని.. తిరుపతి సభలో పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ మాటను నిలదీయాలని.. తన ప్రజల కోసం పోరాటం చేయాలన్న విషయాన్ని చిన్నమ్మ మర్చిపోయారు. అందుకే కాబోలు.. రాజ్యసభలో నిసిగ్గుగా జైట్లీ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేస్తూ.. పీనాసి వ్యాపారి మాదిరి ఆదాయ.. వ్యయాల లెక్కల్ని చెప్పినా అమెకు అందులో తప్పేమీ కనిపించలేదు.

ప్రత్యేక హోదా ఉండదని 14వ ఆర్థిక సంఘం ఆనాడే చెప్పింది కదా అని అమాయకంగా చెప్పిన పురంధేశ్వరి.. బీజేపీ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం చేయదని మాట్లాడారు. ఎలా ఆ మాటలు చెప్పగలరో వివరించినా బాగుండేది. కానీ.. అదేమీ చెప్పకుండా స్టేట్ మెంట్ల మీద స్టేట్ మెంట్లను ఇచ్చేశారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల్ని బీజేపీ కాపాడుతుందని.. కచ్ఛితంగా మాటను నిలబెట్టుకుందని చెప్పుకొచ్చారు. ఏ నమ్మకంతో తానిలా చెబుతున్నానన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. రెవెన్యూ లోటును బీజేపీ భర్తీ చేస్తుందని చెప్పిన ఆమె.. గడిచిన రెండేళ్లలో ఎంతమేర ఆ పని చేసిందో చెప్పి ఉంటే మరింత బాగుండేది. కానీ.. అలాంటివేమీ చెప్పకుండా కేవలం బీజేపీ కోణమే తప్పించి.. ఏపీ ప్రజా ప్రయోజనాలు ఏమీ తనకు అవసరం లేదన్నట్లుగా ఉన్న పురంధేశ్వరి మాటలు విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. ‘‘చిన్నమ్మా.. ఆంధ్రోళ్ల మీద మీకెందుకింత పగ?’’