Begin typing your search above and press return to search.

మరోసారి ముంచేస్తారా చిన్నమ్మ?

By:  Tupaki Desk   |   2 Aug 2015 4:06 AM GMT
మరోసారి ముంచేస్తారా చిన్నమ్మ?
X
కొందరిని వెనుకా ముందు చూసుకోకుండా అభిమానిస్తాం. ఆరాధిస్తాం. వారేం ఇస్తారనే కన్నా.. వారికేం ఇవ్వాలన్న అంశం మీదే దృష్టి పెడుతుంటారు. అది కూడా ఒక్కరో.. ఇద్దరో కాదు.. కొన్ని కోట్ల మంది చేస్తుంటారు. అలాంటి వారు.. తమను అభిమానించే ప్రజానీకం కోసం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు కానీ.. వారి భవిష్యత్తును బలి పెట్టకూడదు.

కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా.. ఎప్పటికప్పుడు తన స్వార్థరాజకీయాలు.. తన ప్రయోజనాలు మాత్రమే పట్టించుకునే నేత.. చిన్నమ్మగా అందరూ అభిమానించే పురంధేశ్వరి. ఎన్టీవోడి కుమార్తెగా.. ఓట్ల రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు.. 2014 సార్వత్రిక ఎన్నికల మినహా.. అంతకు రెండు సార్లు విజయ దుందబి మోగించారు. తెలుగువారి కోసం ఎన్టీవాడి తపనకు.. ప్రతిగా ఆయన కుమార్తెను గెలిపించటం తమ బాధ్యతగా భావించి మరీ చిన్నమ్మకు ఓటేశారు. మరి.. ఇంతగా అభిమానించిన విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు.

తనను అంతగా అభిమానించి.. ఆరాధించిన ప్రజలకు పురంధేశ్వరి ఏమిచ్చారు? ఆమెకు తెలుగు ప్రజలు ఏమిచ్చారన్నది అందరికి తెలిసిందే. తనకు ఓట్లేసిన గెలిపించిన ప్రజల ప్రయోజనాల కంటే కూడా తనకు పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అదినాయకురాలు సోనియమ్మకు విధేయతగా ఉంటూ.. ఏపీ ప్రజల ప్రయోజనాల్ని బలి పెడుతూ.. విభజన సందర్భంగా ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.

విభజన తర్వాత.. పార్టీ మారి కాషాయ కండువా కప్పుకొని.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆమెకు షాక్ ఇస్తూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటమి రుచి చూపించారు. అయినప్పటికీ.. తన భాద్యతను మర్చిపోయిన ఆమె.. ఇప్పటికి తానున్న పార్టీ అధినాయకత్వానికి విధేయతను ప్రదర్శిస్తూ.. మరోసారి తెలుగు ప్రజల ప్రయోజనాల్ని బలి పెట్టటానికి సిద్ధం అవుతున్నట్లుగా కనిపిస్తోంది చిన్నమ్మ మాటలు వింటుంటే.

విభజన బిల్లును ఆమోదించే సమయంలో నాటి ప్రధానమంత్రి పార్లమెంటులో స్వయంగా ఇచ్చిన ఏపీ ప్రత్యేక హామీని తూచ్ అంటూ తాజాగా కేంద్ర సర్కారు తేల్చేసిన నేపథ్యంలో పురంధేశ్వరి మాట్లాడారు. సాంకేతిక కారణాల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేకపోయినా.. ఆ స్థాయిలో రాష్ట్రానికి సాయం అందిస్తారంటూ కేంద్ర వైఖరిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజల ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాల మీద మాత్రమే దృష్టి పెట్టినట్లుగా పురంధేశ్వరి వైఖరి చూస్తుంటే అర్థమవుతోంది. విభజన సమయంలో తాను నిస్సహాయురాలని చేతులెత్తేసిన ఈ చిన్నమ్మ.. ఇప్పుడు ఏపీ ప్రజలకు భారీ నష్టం వాటిల్లే నిర్ణయాన్ని సింఫుల్ గా సాంకేతికం అనటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తాను.. తన రాజకీయ ప్రయోజనాలు తప్పించి.. మరేమీ పట్టవన్న విషయాన్ని చిన్నమ్మ మరోసారి తన మాటలతో నిరూపించేశారు. ఎప్పుడూ మీ ప్రయోజనాలే కానీ.. ఏపీ ప్రజల ప్రయోజనాలు పట్టవా చిన్నమ్మా..?