బాబు టీంపై మరో బాంబు పేల్చిన పురందీశ్వరి

Wed Nov 15 2017 00:04:12 GMT+0530 (IST)

కేంద్ర రాష్ట్ర సంబంధాలపై బీజేపీ సీనియర్ నేత - మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మరోమారు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కేంద్రం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సరైన రీతిలో స్పందించడం లేదని పదేపదే ప్రస్తావించే ఏపీ చిన్నమ్మ తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనులపై కేంద్రంతో రాష్టప్రభుత్వం సరైన రీతిలో సంప్రదింపులు జరపాలని కోరారు. అలా చేయకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందేశ్వరి పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని - జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్ ను కలిసి చర్చించిన సమయంలో ఈ విషయం తనకు స్పష్టమైందన్నారు. పనులు చేపడుతున్న కంపెనీలకు వేర్వేరు అకౌంట్లను తెరిస్తే ఎవరికి చెల్లించాల్సిన డబ్బు వారికి చేరుతుందని చెప్పారన్నారు. అలాగే సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించి నివేదిక ఇచ్చాక కాఫర్ డ్యాంపై నిర్ణయం తీసుకుంటామన్నారని ఆమె తెలిపారు. కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టొద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని ఆమె గుర్తు చేశారు. కానీ చాలా చోట్ల కాపర్ డ్యాం లేకుండానే ప్రాజెక్ట్ లు కట్టారని పురందీశ్వరి చెప్పారు.వాస్తవాలు ఇలా ఉంటే...ఇవన్నీ తెలియకపోవడం వల్లే...కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

కాగా గతవారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పురంధేశ్వరీ కన్నా లక్ష్మినారా యణ రఘురాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతున్న తీరుపై చర్చించారు. కాపర్ డ్యామ్ వద్దని కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలపై వారు ఆరా తీయగా..కాపర్ డ్యామ్ వద్దని ఎక్కడా తాము చెప్పలేదని మంత్రి అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ ను మార్చేది లేదని మరోసారి స్పష్టం చేసినట్లు బీజేపీ నేతలు వివరించారు. పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేదని.. బిల్లులు వచ్చిన వెంటనే వాటిని క్లియర్ చేసేలా వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి బీజేపీ నేతలకు వివరించారు. సబ్‌కాంట్రాక్టర్లకు బిల్లులు నేరుగా ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు అవసరమైన సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని కోరామని అయితే దానిపై రాష్ట్రం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని మంత్రి అభిప్రాయపడ్డారని బీజేపీ నేతలు చెప్పారు.