Begin typing your search above and press return to search.

పుణెలో ఇంటికో వాహ‌నం ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   7 April 2018 9:17 AM GMT
పుణెలో ఇంటికో వాహ‌నం ఉంద‌ట‌!
X
దేశంలో అభివృద్ధి చెందిన మెట్రోన‌గ‌రాల‌ను ట్రాఫిక్ స‌మ‌స్య ప‌ట్టిపీడిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముంబై, పుణె, ఢిల్లీ, హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రాల్లో చాలామంది కార్లు, బైకులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో, భారీగా వాహ‌నాల సంఖ్య పెరిగిపోయి త‌ద్వారా వాతావ‌ర‌ణం క‌లుషిత‌మ‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ, సొంత వాహ‌నాల కొనేందుకు జ‌నం మొగ్గు చూపుతున్నారు. తాజాగా, పుణెలో జ‌నాభా సంఖ్య కంటే అక్క‌డ ఉన్న వాహ‌నాల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని ఆర్టీవో అధికారులు షాకింగ్ గ‌ణాంకాలు వెల్ల‌డించారు. పుణె జ‌నాభా 35 ల‌క్ష‌ల‌ని, న‌గ‌రంలోని వాహ‌నాల సంఖ్య 36.27 ల‌క్ష‌ల‌ని ఆర్టీవో అధికారి అజ్రి తెలిపారు. గ‌త ఏడాది 33.27 ల‌క్ష‌ల వాహ‌నాలున్నాయ‌ని, మార్చి 31, 2018 నాటికి ఆ సంఖ్య‌ 36.27 ల‌క్ష‌లకు చేరుకుంద‌ని ఆయ‌న చెప్పారు.

గ‌త ఏడాది న‌గ‌ర‌వాసులు 5.89 ల‌క్ష‌ల ఫోర్ వీల‌ర్లు కొన్నార‌ని, ఈ ఏడాది వాటి సంఖ్య 6.45 ల‌క్ష‌ల‌కు పెరిగింద‌ని చెప్పారు. అదే 2 వీల‌ర్ల విష‌యంలో ఆ సంఖ్య 24.97 నుంచి 27.03 ల‌క్ష‌ల‌కు చేరుకుంద‌ని తెలిపారు. ఆ గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌తి కుటుంబంలో ఒక‌రికి ఏదో ఒక వాహ‌నం ఉంద‌ని తెలిపారు. న‌గ‌రంలో క్యాబ్ ల సంఖ్య ఎక్కువ‌యింద‌ని, చాలామంది క్యాబ్ ల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని తెలిపారు. దీనికితోడు పుణె పరిస‌ర ప్రాంతాల్లో ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, విద్యాసంస్థ‌ల వ‌ల్ల చాలామంది ప్ర‌జ‌లు క్యాబ్ ల పై ఆధార‌ప‌డుతున్నార‌ని, అందువ‌ల్ల వాటిని కొనేవారి సంఖ్య పెరిగిపోయింద‌ని తెలిపారు. న‌గ‌రంలో భారీగా పెరిగిన వాహ‌నాల వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అయితే, త్వ‌ర‌లో రాబోతోన్న మెట్రోరైలు, కొత్త ఔట‌ర్ రింగురోడ్డు వ‌ల్ల ఆ ఇబ్బందుల‌క చెక్ ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు.