Begin typing your search above and press return to search.

స్టెంట్ ధ‌ర‌ల మోసం బ‌య‌ట‌ప‌డింది

By:  Tupaki Desk   |   19 Jan 2017 6:13 AM GMT
స్టెంట్ ధ‌ర‌ల మోసం బ‌య‌ట‌ప‌డింది
X
ఇటీవ‌లి కాలంలో గుండె పోటు రావ‌డం అనేది ఎంత స‌హ‌జంగా మారిపోయింది. గుండెలోని రక్తనాళాలు మూసుకొనిపోతే స్టెంట్లు వేయడం అంతే మామూలైపోయింది. అయితే స్టెంట్‌ ల తయారీ ధరకు.. అంతిమంగా వినియోగదారుడు చెల్లించే ధరకు మధ్య న‌క్కకు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉందని అధికారికంగా తేలిపోయింది. దుర‌దృష్ట‌వశాత్తు గుండెపోటు వ‌చ్చి త‌ప్ప‌నిస‌రి స్టెంట్ అమ‌ర్చుకోవాల్సిన వ్య‌క్తి న‌డ్డివిరిచేలా ధ‌ర‌ల భారం మోపుతున్నార‌ని జాతీయ ఔషధ ధరల ప్రాధికారసంస్థ (ఎన్‌ పీపీఏ) ధృవీకరించింది. కంపెనీలో త‌యారై బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యం నుంచి వినియోగదారుని చేరేలోపల స్టెంట్ల‌ ధర పదింతలు పెరుగుతుందని తేల్చిచెప్పింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన లెక్కలను విడుదల చేసింది.

ర‌క్త‌నాళాలు మూసుకుపోయిన స‌మ‌యంలో అమ‌ర్చే స్టెంట్ల త‌యారీ కంపెనీలు సమకూర్చిన డేటా ఆధారంగా ఎన్‌ పీపీఏ జరిపిన అధ్యయనంలో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. స్టెంట్ల అమ్మ‌క‌కం మార్జిన్లు 270 శాతం నుంచి 1000 శాతం వరకు ఉంటున్నట్టు వెల్లడైంది. హాస్పిటల్ స్థాయిలోనే ధర ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే అన్ని దవాఖానలు భారీగా పెంచ‌క‌పోవ‌చ్చున‌ని, ఆయా సంస్థ‌ల‌ను బ‌ట్టి ఇందులో తేడా ఉంద‌ని వివ‌రించింది. హాస్పిటల్ మార్జిన్ 11 నుంచి 654 శాతం వరకు ఉన్నట్టు అంచనా వేశారు. మందును విడుదల చేసే డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ (డీఈఎస్) ధర స్వదేశీ కంపెనీ ఉత్పాదన అయితే 8 వేలు - దిగుమతి చేసుకున్నది అయితే 5 వేల నుంచి మొదలవుతుంది. మనదేశంలో ఉపయోగించే స్టెంట్‌ లలో 95 శాతంవరకు డీఈఎస్‌ లే ఉంటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/