Begin typing your search above and press return to search.

మొన్న భర్త.. ఇవాళ కూతురు పొగిడేశారు

By:  Tupaki Desk   |   29 July 2016 9:29 AM GMT
మొన్న భర్త.. ఇవాళ కూతురు పొగిడేశారు
X
మరికొద్ది నెలల్లో మొదలు కానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన హడావుడి కాస్త ముందే మొదలైనట్లుగా చెప్పాలి. మొన్నటివరకూ ప్రైమరీ ఎన్నికల ప్రచారం.. వాటి ఫలితాలు రావటం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ప్రైమరీ ఎన్నికలు ఒక కొలిక్కి వచ్చి.. తాజాగా రెండు పార్టీల అభ్యర్థుల ఎవరన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి వారు తమ తమ ప్రచారాన్ని తమదైన శైలిలో షురూ చేసేవారు.

ట్రంప్ తో పోలిస్తే.. కాస్త ఆలస్యంగా డెమొక్రాట్ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ప్రకటన వెలువడింది.అయితే.. వినూత్న ప్రచారంతో హిల్లరీ అందరిలో ఆసక్తిని రేపుతున్నారు. వాస్తవానికి ఈ విషయంలో కూడా ట్రంప్ ఒక అడుగు ముందున్నారనే చెప్పాలి. కంపు మాటలతో చిత్రమైన ఇమేజ్ ఉన్న ట్రంప్ ఎంత మంచి మనిషి అన్న విషయాన్ని.. ట్రంప్ సతీమణి పార్టీ సభలో చెప్పటం అందరిని ఆకట్టుకుంది.

దీని తర్వాత ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ గొప్పతనం గురించి ఆమె భర్త.. మాజీ అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ విపరీతంగా పొగిడేశారు. అనంతరం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హిల్లరీని ఘనంగా కీర్తించేశారు. తనకంటే హిల్లరీకి సమర్థత ఎక్కువని ఆయన చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా తాజాగా ప్రసంగించారు. ఫిలడెల్పియాలో జరుగుతున్న డెమొక్రాట్ల కన్వెన్షన్ లో ప్రసంగించిన చెల్సియా తన మాటలతో సభికుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. హిల్లరీని మొన్నటికి మొన్న భర్త పొగిడేస్తే.. తాజాగా కుమార్తె పొగిడేయటం ఒక అరుదైన ఘనతగా అభివర్ణిస్తున్నారు. తన తల్లి తనకు ఆదర్శమని.. ఆమె దేని కోసం పోరాడుతుందో ఆ విషయాన్ని ఎన్నటికి మర్చిపోదన్నారు. ఈ ఏడాది నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను తన తల్లికి ఓటేస్తానని చెప్పిన చెల్సియా.. తాను ఓటువేయటం అంటే.. అభివృద్ధిని ఎన్నుకున్నట్లుగా చెప్పారు. అమెరికాను ఎవరైతే తుపాకీ సంస్కృతి నుంచి కాపాడగలరో వారికే తాను ఓటు వేయనున్నట్లుగా చెప్పి.. తన తల్లి ఏం చేయగలదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.