Begin typing your search above and press return to search.

ఏపీలో హోదా నిర‌స‌న ఎలా జ‌రిగింది?

By:  Tupaki Desk   |   22 March 2018 11:39 AM GMT
ఏపీలో హోదా నిర‌స‌న ఎలా జ‌రిగింది?
X
విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదాపై మోడీ స‌ర్కారు ఎన్ని పిల్లిమొగ్గ‌లు వేసిందో తెలిసిందే. హోదాపై మోడీ స‌ర్కారుకు త‌గ్గ‌ట్లే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఏపీ అధికార‌ప‌క్షం టీడీపీ మాట మార్చ‌టం.. చివ‌ర‌కు ఆంధ్రోళ్ల‌లో హోదా సెంటిమెంట్ భారీగా ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. హోదాతోనే అంతా అన్న‌ట్లుగా యూట‌ర్న్ తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో హోదా కోసం అధికార‌.. విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌య్యాయి. హోదా సాధ‌న‌లో భాగంగా ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి మొద‌లైన జాతీయ ర‌హ‌దారుల దిగ్బందం మ‌ధ్య‌హ్నాం 12 గంట‌ల వ‌ర‌కు సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారుల్ని దిగ్బందించి నిర‌స‌న తెలుపుతూ ప‌లు పార్టీలు రోడ్ల మీద‌కు వ‌చ్చాయి.

ఏపీ అధికార‌ప‌క్ష‌మైన టీడీపీ.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. క‌మ్యూనిస్టులు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో చ‌చ్చిపోయిన కాంగ్రెస్ తో స‌హా జ‌న‌సేన సైతం త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించింది. అయితే.. పార్టీ ప‌రంగా ఉన్న వైరుధ్యాల నేప‌థ్యంలో ఎవ‌రికి వారు నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీంతో.. నిర‌స‌న భారీగా సాగింది. ఏపీలోని 13 జిల్లాల వారు హోదా కోసం నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.

విశాఖ కేంద్రంలో రైల్వే జోన్ ప్ర‌క‌టించాల‌ని కోరుతూ విశాఖ‌లో అఖిల‌ప‌క్షం నేత‌లు జాతీయ ర‌హ‌దారిని దిగ్బందించారు. ఈ సంద‌ర్భంగా భారీర్యాలీని చేప‌ట్టారు. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని ఇప్ప‌టికేనా నెర‌వేర్చ‌ని ప‌క్షంలో ఉద్య‌మం మ‌రింత ఉధృతం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న తెలుపుతూ వాహ‌నాల్ని నిలిపివేయ‌టంతో పెద్ద ఎత్తున వాహ‌నాలు ఆగిపోయాయి.

శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం మొద‌లు నెల్లూరు జిల్లా త‌డ వ‌ర‌కు ఉన్న 16వ నేష‌న‌ల్ హైవేను నిలిపివేశారు. దీంతో.. పెద్ద ఎత్తున వాహ‌నాలు నిలిచిపోయాయి. ఉత్త‌రాంధ్ర‌తో పాటు.. కోస్తాలోని కృష్ణా.. గుంటూరు.. ప్ర‌కాశం.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ.. సీమ‌లోని నాలుగు జిల్లాల్లోనూ నిర‌స‌న ఉధృతంగా సాగింది. అన్ని పార్టీల వారు రోడ్ల మీద‌కు వ‌చ్చి హోదా నినాదాలు చేశారు. హోదాపై ఏపీలోని అన్ని పార్టీలు (బిజేపీ మిన‌హా) హోదా గ‌ళం విప్ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక‌.. ఏపీ ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే మోడీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.