Begin typing your search above and press return to search.

రాజ‌న్ ఆగ్ర‌హంలో ఆంత‌ర్యం ఇదేనా?

By:  Tupaki Desk   |   27 July 2016 4:07 AM GMT
రాజ‌న్ ఆగ్ర‌హంలో ఆంత‌ర్యం ఇదేనా?
X
భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్‌ కు కోపం వ‌చ్చిన‌ట్టుంది! త‌న‌పై వెల్లువెత్తిన విమ‌ర్శ‌లకు ధీటుగా స్పందించారు. ఢిల్లీలో జ‌రిగిన స్టాట‌స్టిక్స్ డే కాన్ఫ‌రెన్స్‌ లో ఆయ‌న మాట్లాడారు. ఎప్ప‌టిక‌ప్పుడు వ‌డ్డీ రేట్ల‌ను పెంచేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిని ఆర్బీఐ అడ్డుకుంటోంద‌న్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వాలు లేవ‌ని రాజ‌న్ కొట్టిపారేశారు. వీటిని కొన్ని శ‌క్తుల ప్రేరేపిత విమ‌ర్శ‌లుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు అతీతంగా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా కోరారు. అంతేకాదు - రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న స్వ‌యం ప్ర‌తిప‌త్తిని కాపాడాల‌ని రాజ‌న్ అన్నారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డానికి గ‌ల కార‌ణం అదృష్టం అని కొంత‌మంది వ్యాఖ్యానించ‌డంపై కూడా ఆయ‌న మండిప‌డ్డారు. చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్లనే ద్ర‌వ్యోల్బ‌ణం గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్న విష‌యాన్ని తెలుసుకోవాల‌న్నారు. దీనికి తోడు ఆర్బీఐ అనుస‌రిస్తున్న ద్ర‌వ్య విధానం కూడా మ‌రో కీల‌క కార‌ణ‌మ‌ని మ‌ర‌చిపోకూడ‌ద‌ని చెప్పారు. ప్ర‌పంచవ్యాప్తంగా ధ‌ర‌లు త‌గ్గుతూ ఉన్నా ఆ ఫ‌లాలు మ‌న‌దేశ ప్ర‌జ‌ల‌కు అంద‌క‌పోవ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వం పెంచుతున్న సుంకాలే అని రాజ‌న్ వివ‌రించారు. పెట్రోల్‌ - డీజిల్ వంటివాటిపై ఎక్సైజ్ సుంకాల‌ను ప్ర‌భుత్వం పెంచుతూ పోవ‌డం వ‌ల్ల‌నే ఆ ప్ర‌యోజ‌నాలు ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేద‌ని అన్నారు.

ఈ మ‌ధ్య ఆయ‌న‌పై వినిపించిన విమ‌ర్శ‌ల‌కు రాజ‌న్ ధీలుగా స‌మాధానం ఇచ్చార‌నే చెప్పుకోవాలి. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ గా ఆయ‌న ప‌ద‌వీ కాలం సెప్టెంబ‌ర్‌ తో ముగుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని మ‌రోసారి కొన‌సాగించాల‌న్న డిమాండ్ అన్ని వ‌ర్గాల నుంచీ వినిపిస్తున్నా కూడా భాజ‌పా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే! భాజ‌పా నాయ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి చేసిన విమ‌ర్శ‌లు ఈ మ‌ధ్య చ‌ర్చ‌నీయం అయ్యాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు రాజ‌న్ ఈ విధంగా స‌మాధానం చెప్పార‌ని అనుకోవాలి. నిజానికి, రాజ‌న్ ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌ గా ఉండ‌టం వ‌ల్ల‌నే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా ఉంద‌నీ, ఆయ‌న విధానాలు అద్భుతం అంటూ ఎంతోమంది ఆర్థిక‌వేత్త‌లు - పారిశ్రామిక దిగ్గ‌జాలు కొనియాడుతున్న నేప‌థ్యంలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి వంటివారు విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం!