ప్రొ. నాగేశ్వర్ సర్వే.. గెలుపెవరిదంటే.?

Sat Dec 08 2018 10:14:29 GMT+0530 (IST)

తెలంగాణలో రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఎట్టేకలకు ముగిసిపోయింది. ఓటరు నాడి ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎగ్టిట్ పోల్స్ అన్నీ వచ్చేశాయి. జాతీయ మీడియా చానళ్లన్నీ తెలంగాణలో గులాబీదే గుభాళింపు అని తేల్చేశాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ మాత్రమే టీఆర్ ఎస్ 50 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లగడపాటి మాత్రం ప్రజాఫంట్ దే అధికారం అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ అనలిస్ట్ - ఎమ్మెల్సీ అయిన ప్రొ. నాగేశ్వర్ తెలంగాణలో గెలుపు అవకాశాలపై స్పష్టంగా సవివరంగా విశ్లేషణ చేశారు.ప్రొ. నాగేశ్వర్ మాట్లాడుతూ.. జనాలు చెప్పేదానికి.. ఈవీఎంలలో ఓటేసేదానికి చాలా తేడా కనపడుతోందని విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉందని విశ్లేషించారు. టీఆర్ ఎస్ పట్ల సార్వత్రిక అసంతృప్తి లేదని.. కేసీఆర్ పట్ల సానుకూలత ఉందని.. ఐదేళ్ల పాలన చూశాక ఈ పనులన్నీ ఆగిపోవద్దంటే.. మరోసారి అవకాశం ఇద్దామని యోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తన అంచనా ప్రకారం టీఆర్ ఎస్ కు 100 సీట్లు అయితే రావు కానీ..  ప్లస్ ఆర్ మైనస్ 70 సీట్లు వరకూ వస్తాయని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు నుంచి పోలింగ్ జరిగే వరకు పరిణామాలు గమనిస్తే టీఆర్ ఎస్ బలం గణనీయంగా తగ్గిందని స్పష్టమవుతోందని ప్రొ నాగేశ్వర్ విశ్లేషించారు. కాంగ్రెస్ ఓడినా.. గెల్చినట్టేనని తెలిపారు. చంద్రబాబు ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల తెలంగాణ ఓటర్లలో అభద్రతాభావం ఏర్పడిందని.. బాబును బూచిగా చూపి టీఆర్ ఎస్ తెలంగాణలో సెంటిమెంట్ ను రగిలించిందని పేర్కొన్నారు. బాబు పదేపదే కేసీఆర్ ను టార్గెట్ చేయడం కూడా ఓటర్లలో సానుభూతి నింపిందని విశ్లేషించారు. బీజేపీ కి సీట్లు పెరుగుతాయనడంతో టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడకుండా బీజేపీకి మళ్లిందని అర్థమవుతోందని తెలిపారు.

తెలంగాణలో చంద్రబాబు అధిక ప్రచారమే మహాకూటమి పుట్టిముంచేలా కనిపిస్తోందని ప్రొ. నాగేశ్వర్ విశ్లేషించారు. బాబు ఇలా చేయడం వల్ల కరుడుగట్టిన తెలంగాణ వాదులంతా కాంగ్రెస్ కు దూరమయ్యారని తెలిపారు. పవన్ - జగన్ పార్టీలకు చెందిన సానుభూతి పరులు కూడా కూటమి గెలిస్తే చంద్రబాబు బలపడుతాడని.. ఏపీ ఎన్నికల్లో ఇబ్బంది అని వారంతా టీఆర్ ఎస్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వంపై దళితులు - ఉద్యోగులు - యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. కానీ రైతులు - పెన్షనర్లు - బీసీల్లో  మంచి సానుకూలత ఉండడం కలిసి వచ్చిందని ప్రొ నాగేశ్వర్ విశ్లేషించారు. తెలంగాణలో టీడీపీకి అండగా ఉన్న ఓబీసీలు రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ ఎస్ కు షిఫ్ట్ అయ్యారని తెలిపారు. దీనివల్లే ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కొట్టుకుపోయిందని తెలిపారు. ఎంఐఎంతో పొత్తు వల్ల కూడా ముస్లిం ఓట్లు పడ్డాయని.. తెలిపారు. టీఆర్ ఎస్ కాస్త షాక్ ఇద్దామని జనాలు ఆలోచించారే కానీ.. ఓడించాలని మాత్రం అనుకోలేదని నాగేశ్వర్ స్పష్టం చేశారు.