Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆర్టీసీ ఫార్ములాకు క్వశ్చన్లు సంధించిన మేధావి

By:  Tupaki Desk   |   9 Oct 2019 10:23 AM GMT
కేసీఆర్ ఆర్టీసీ ఫార్ములాకు క్వశ్చన్లు సంధించిన మేధావి
X
తెలుగు నేల మీద కంటెంట్ ఉన్న ప్రముఖులు చాలా తక్కువమందే ఉన్నారని చెప్పాలి. విషయం ఎంత ఉన్నా.. దాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన రీతిలో.. ఎంత క్లిష్టమైన అంశాన్ని అయినా సరే..సామాన్యులకు సైతం ఇట్టే అర్థమయ్యేలా వివరించి చెప్పటంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కు సాటి వచ్చే వారు చాలా తక్కువమంది ఉంటారు.

రాజకీయ.. ఆర్థిక.. ఇలా అంశం ఏదైనా ఫర్లేదు.. విశ్లేషణలో ఆయన తీరు వేరుగా ఉంటుంది. విషయాన్ని విషయంగా చెప్పటంతో పాటు.. తన ప్రశ్నలతో పాలకులకు వెన్నులో చలి పుట్టేలా చేయటంలో ఆయనకు మంచి పేరుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీని మూడు ముక్కలుగా చేస్తూ.. ఒక ఫార్ములాను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.

తెలంగాణ ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో సొంతానికి 50 శాతం.. అద్దె బస్సులు 30 శాతం.. మిగిలిన 20 శాతం ప్రైవేటు బస్సులు నడిపిస్తామంటూ సీఎం కేసీఆర్ వాదనకు అదిరిపోయే రీతిలో ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఏ మాత్రం సరైనది కాదని.. ప్రైవేటీకరణతో ఆర్టీసీకి పునర్ వైభవం ఎలా తెస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ ఫార్ములాతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న నాగేశ్వర్.. అందుకు తగ్గట్లు తన వాదననను వినిపించారు. ఆ వాదనలోని కీలక అంశాలు చూస్తే.. సీఎం సారు చెప్పే మాటల్లో పస లేదన్న సంగతి ఇట్టే అర్థం కాక మానదు. నాగేశ్వర్ వాదనలోని కీలక అంశాలు చూస్తే..

% కొన్ని రూట్లలోనే ప్రైవేట్ వాహనాలు అధికారికంగా నడుస్తున్నాయి. కొన్ని రూట్లలో అనధికారికంగా ప్రైవేట్ వాహనాలు వెళ్తున్నాయి. ఒక్కో పర్మిట్‌పై రెండు.. మూడు బస్సులు కూడా వెళ్తు్న్నాయి. మరి.. అలాంటి లోటుపాట్లు సరిదిద్దకుండా పూర్వవైభవం సాధ్యమా?

% ఆంధ్రా బస్సులతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఒకప్పుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. ప్రైవేట్ బస్సుల సంఖ్య మరింత పెరిగింది. మరి.. దీన్నేమనాలి?

% లక్డీకాపూల్.. అమీర్‌పేట.. కాచిగూడ.. మలక్‌పేట.. దిల్‌సుఖ్‌నగర్ లాంటి లాభాలు వచ్చే రూట్లలోనే ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణ జిల్లాలు.. గ్రామాల్లో ప్రైవేట్ బస్సులు ఎందుకు నడవట్లేదో ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతారా?

% హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు వంటి లాభాల రూట్లలోనే ప్రైవేట్ బస్సులు నడవడం ఎంతవరకూ సమంజసం?

% 20 శాతం ప్రైవేట్ బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఆర్టీసీ ఆదాయానికి మరింత గండి పడటం ఖాయం. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే ఆర్టీసీ వేల కోట్లు నష్టపోతుంది. 20 శాతానికి బదులు.. అనధికారికంగా 30 శాతం ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తాయి. ప్రైవేటుట్రావెల్స్ పల్లెలకు పది ట్రిప్పుల్లో ఒకటి వేసి.. పది ట్రిప్పులు వేసినట్లుగా చెప్పుకుంటే ఏం చేస్తారు?

% చట్టవిరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ ను ఎందుకు ఆపట్లేదు?

% ప్రైవేటు ట్రావెల్స్ కు సర్కారు సబ్సిడీలు ఇస్తామంటోంది. అదేదో ఆర్టీసీకే సబ్సిడీలు ఇస్తే సరిపోతుంది కదా? అద్దె బస్సులతో ఆర్టీసీకి తక్కువ ఆదాయం. ఇప్పుడు వాటినే మరింత పెంచితే ఆర్టీసీ ఆదాయం మరింత తగ్గుతుంది కదా?

% ప్రభుత్వం తీరుతో సర్కారు ఇచ్చే సబ్సిడీలను లాగేసుకొని.. ఆర్టీసీని మరింత గండి కొడతాయి. అది ప్రజలకు.. ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం. ఈ ఫార్ములాతో లాభం ఎలానో ప్రభుత్వం నిరూపించగలదా?