Begin typing your search above and press return to search.

సిలబస్ లో సారు ప్రస్తావనే లేదేంటి కేసీఆర్..?

By:  Tupaki Desk   |   4 Sep 2015 5:13 AM GMT
సిలబస్ లో సారు ప్రస్తావనే లేదేంటి కేసీఆర్..?
X
కేసీఆర్ మైండ్ సెట్ చాలా భిన్నంగా ఉంటుంది. ఆయనకు నచ్చని వారి విషయంలో అనుసరించే ధోరణి చాలా చిత్రంగా ఉంటుంది. తన మనసులోని అయిష్టతను బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే.. చేయాల్సిన విధంగా చేసేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ మధ్య కాలంలో చనిపోయిన దాశరధి రంగాచార్య గుర్తుకున్నారా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆయన్ను మహా మనీషిగా చెప్పాల్సిందే.

పండితుడిగా.. సంఘ సంస్కర్తగా.. తెలంగాణ భావజాలంతో బతికిన ఆయన.. తాను బతికున్నంత కాలం తెలంగాణ సమాజం కోసం ఎంతగానో శ్రమించారు. అయితే.. ఆయనతో కొన్ని విషయాల్లో కేసీఆర్ కు పడదు. అందుకే.. ఆయన మరణించిన సమయంలో.. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించుకోవటానికి ఇష్టపడలేదు. రంగాచార్య మరణంపై తన సానుభూతిని ప్రకటన రూపంలో వెల్లడించారే తప్పించి.. అంతటి గొప్ప వ్యక్తి మరణించిన దానికి తెలంగాణ సర్కారు ఘనంగా సంస్మరణ సభను నిర్వహించింది లేదు.

తెలంగాణకు సంబంధించి చాలా అంశాల్ని తాను తప్పించి మరెవరూ స్పృశించరని చెప్పుకునే కేసీఆర్ ను జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన వైఖరి ఒక్కొక్కరి విషయంలో ఒక్కో మాదిరి ఉండటం కనిపిస్తుంది.

ఎవరి వరకో ఎందుకు.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ గురించి తీసుకుందాం. ఆయన ప్రస్తావన లేని తెలంగాణ ఉద్యమం లేనట్లే. కానీ.. ఉద్యమం తుది దశలో ఆయన ఆలోచనలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వని కేసీఆర్.. సార్ ప్రస్తావన.. తెలంగాణ పోటీ పరీక్షలకు సంబంధించి విడుదల చేసిన సిలబస్ లో రేఖా మాత్రంగా లేకపోవటం గమనార్హం.

తెలంగాణ ఉద్యమ సిలబస్ లో ఎంతసేపటికి.. తెలంగాణ రాష్ట్ర సమితి.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష తప్పించి.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి సంబంధించిన ప్రస్తావన లేకపోవటం చూసినప్పుడు.. కేసీఆర్ మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసం ఇట్టే కనిపిస్తుంది.