Begin typing your search above and press return to search.

తెలంగాణ వ‌చ్చాక జ‌రిగేది సార్ అప్పుడే చెప్పార‌ట‌

By:  Tupaki Desk   |   22 Jun 2018 7:51 AM GMT
తెలంగాణ వ‌చ్చాక జ‌రిగేది సార్ అప్పుడే చెప్పార‌ట‌
X
క‌ల‌ల తెలంగాణ‌ను సాధించుకున్న త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? ఈ విష‌యాన్ని కోట్లాది తెలంగాణ వాదులు ఎలా ఆలోచించార‌న్న‌ది పక్క‌న పెడితే.. ఏం జ‌రుగుతుందన్న విష‌యాన్ని మాత్రం తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంకర్ సార్ మాత్రం ఊహించారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ యాది స‌భ సంద‌ర్భంగా కోదండం మాష్టారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్ని చేశారు.

తెలంగాణ ఉద్య‌మంలో టీ రాజ‌కీయ జేఏసీకి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఇటీవ‌ల తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్ని ఉద్య‌మ స‌మ‌యంలోనే జ‌య‌శంక‌ర్ సార్ ఊహించిన‌ట్లుగా కోదండం మాష్టారు చెప్పారు.

రాష్ట్రం వ‌చ్చాక ఉండేది మ‌న ప్ర‌భుత్వ‌మే క‌దా? పోరాడాల్సిన అవ‌స‌రం ఏముంటుంద‌ని అడిగితే ఆయ‌న అంగీక‌రించే వారు కాద‌న్నారు. రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితులు మీకు అర్థ‌మ‌వుతున్నాయి క‌దా? అనే వారు.ఎక్కువ‌సార్లు అడిగితే విసుక్కునే వార‌న్న కోదండ‌రాం.. అభివృద్ధి ప‌ళాలు అంద‌రికీ ద‌క్కేలా ప‌ని చేయాల‌న్న మాట‌ను త‌ర‌చూ చెప్పేవార‌న్నారు.

రాష్ట్రం కొత్త‌గా వ‌చ్చినా పాల‌కుల తీరు మాత్రం పాత‌గానే ఉంద‌న్న వైనాన్ని జ‌య‌శంక‌ర్ మాష్టారు నాడే గుర్తించార‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం కొంద‌రు చిన్న అవ‌కాశం దొర‌క‌గానే నేను లీడ‌ర్‌.. మీరంతా నా కేడ‌ర్ అంటున్నారంటూ త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై కోదండం మాష్టారు స‌టైర్ వేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. జ‌య‌శంక‌ర్ వ‌ర్థంతి స‌భ‌ను టీఆర్ ఎస్ కూడా ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు.

యూపీఏ 1 స‌ర్కారు తెలంగాణ‌పై మాట త‌ప్పుతుంద‌ని సంకేతాలు అందిన క్లిష్ట త‌రుణంలో కేసీఆర్‌ కు మ‌నోధైర్యాన్ని ఇచ్చిన వ్య‌క్తి జ‌య‌శంక‌ర్ సార్ అని కేటీఆర్ చెప్పారు. ఉద్య‌మ స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌లు.. ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓడిపోగానే కేసీఆర్ లో ఆయ‌నే ధైర్యాన్ని నూరిపోశార‌ని గుర్తు చేసుకున్నారు.

రావ్ సాబ్‌.. మీ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌ను సాధించుకు తీరుతాం.. దిగులు ప‌డ‌మాకండ‌ని సార్ చెప్పే వార‌న్నారు. తెలంగాణ‌కు సంబంధించిన విష‌యాల‌న్నీ అవ‌పోస‌న ప‌ట్టిన వారిగా సార్ ను అభివ‌ర్ణించారు. సీమాంధ్ర పాల‌కులు తీసుకున్న ఏ నిర్ణ‌యం వ‌ల్ల తెలంగాణ‌కు ఎంత అన్యాయం జ‌రిగేదో లెక్క‌ల‌తో స‌హా జ‌య‌శంక‌ర్ త‌మ‌కు చెప్పార‌న్నారు. సార్ గురించి ఇద్ద‌రు తెలంగాణ ప్ర‌ముఖులు త‌మ త‌మ కోణాల్లో చెప్పిన వైనం ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆలోచించేలా ఉండ‌టం ఖాయం.