Begin typing your search above and press return to search.

ప్రియాంక రంగంలోకి వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 Jan 2017 10:32 AM GMT
ప్రియాంక రంగంలోకి వచ్చేసింది
X
ఇంతకాలం గుట్టుగా తన పని తాను చేసుకుంటున్నట్లుగా ఉన్న ప్రియాంక గాంధీ తొలిసారి యూపీ ఎన్నికల సందర్భంగా యాక్టివ్ గా వ్యవహరించటం తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎస్పీ.. కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరేలా పావులు కదిపిన విషయం తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రి సతీమణితో మంత్రాంగం నడపటం ద్వారా.. కాంగ్రెస్ తో పొత్తుకు చర్చలకు అవసరమైన వాతావరణాన్ని ప్రియాంక కల్పించారు.

అయితే.. కాంగ్రెస్ నేతల మొండితనం.. వంద సీట్లు కచ్ఛితంగా కావాలంటూ గట్టిగా అడగటంతో.. అన్నేసి సీట్లు ఇచ్చేస్తే ఇంకేమైనా ఉందా? అన్న ఉద్దేశంతో కటీఫ్ దిశగా అఖిలేశ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం సీట్లలో దాదాపు యాభై శాతం సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు. నిజానికి యూపీలో కాంగ్రెస్ కు ఉన్న బలం అంతంతమాత్రమే. ఇప్పటికే ఈ అంశాన్ని పలు సర్వేలు స్పష్టం చేశాయి కూడా.

అయినా.. ఎస్పీతో పొత్తు కారణంగా తన బలం రెట్టింపు అయ్యే నేపథ్యంలో.. లాభ పడాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇలాంటి ఎత్తుల్ని ఇట్టే గ్రహించే అఖిలేశ్ కాంగ్రెస్ ఒత్తిళ్లను అస్సలు ఒప్పుకోలేదు. లెక్క తేడా వస్తే.. తండ్రికే చుక్కలు చూపించిన అఖిలేశ్.. కాంగ్రెస్ మాటలు వింటారనుకోవటం కామెడీనే. వింటే తాను చెప్పినట్లుగా వినాలన్న సంకేతాన్ని తాజా అభ్యర్థుల జాబితా విడుదలతో చెప్పేసిన అఖిలేశ్ దెబ్బకు.. ఇరు పార్టీల మధ్య దాదాపు పొత్తు లేదన్న వాతావరణం ఏర్పడింది.

అయితే.. ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటే.. మొత్తంగా నష్టపోయేది తామేనన్న విషయాన్ని గుర్తించిన ప్రియాంక.. మరోమారు రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక దూతను ముఖ్యమంత్రి అఖిలేశ్ దగ్గరకు పంపినట్లుగా చెబుతున్నారు. ఆమె రాజీ ఫార్ములాను సూచించి ఉంటారని చెబుతున్నారు. మరి.. ప్రియాంక ప్రత్యేక దూత.. ఆమె కోరుకున్నట్లే పనిని పూర్తి చేస్తారా? లేదా? ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/