అన్న గెలుపు కోసం ప్రియాంక రెండు చోట్ల కష్టం!

Sat Apr 20 2019 22:48:00 GMT+0530 (IST)

ఇది వరకూ ఎన్నికల సమయంలో అమేఠీ రాయబరేలీ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను ప్రియాంక వాద్రానే చూసుకునే వారు. తన తల్లి పోటీ చేసే రాయబరేలీలోనూ అన్న పోటీ చేసే అమేఠీలోనూ ప్రియాంక ప్రచారాన్ని హోరెత్తించే వారు. వారి విజయానికి ప్రియాంక అలా కష్ట పడేవాళ్లు.  రాహుల్ సోనియాలు గత ఎన్నికల సమయంలో కూడా దేశ వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడితే.. వారి కోసం ప్రియాంక ప్రచారం చేశారు. ఇక ఈ సారి ప్రియాంకకు కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమెకు పార్టీ పదవిని ఇచ్చి దేశ వ్యాప్తంగా పార్టీ బాధ్యతలను అప్పగించినంత పని చేశారు. ఇక ఆమెను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే ప్రయత్నంలో కూడా ఉన్నారు.

ఇంకా ఆ విషయంలో మిస్టరీ అని అంటున్నారు. ఆ మిస్టరీని రాహుల్ గాంధీ ఎప్పుడు తెర దించుతారో చూడాల్సి ఉంది. అయితే ఈ సారే ప్రియాంకను పోటీ చేయించేస్తే కాంగ్రెస్ కు భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుందని ఆ పార్టీ నేతలే కొంతమంది అంటున్నారు. దీంతో ప్రియాంక పోటీ చేస్తుందా చేయరా.. అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు.

ఆ సంగతలా ఉంటే.. ఈ సారి ప్రియాంకకు అదనపు కష్టం తప్పడం లేదు. ఈ సారి అన్నను గెలిపించుకోవడం కోసం ఆమె వయనాడ్ లో కూడా కష్టపడుతూ ఉన్నారు.

ఇన్నేళ్లూ అన్న కోసం అమేఠీలో మాత్రమే ప్రచారం చేస్తే సరిపోయేది ఇప్పుడు వయనాడ్ లో కూడా తిరుగుతున్నారామె. వయనాడ్ లో రెండ్రోజుల పాటు రాహుల్ ప్రచారం చేసి వెళ్లారు. ఇక తాజాగా అక్కడ ప్రియాంక దిగారు. రకరకాల మాటలు చెబుతూ అక్కడి ఓటర్లను ఆకట్టుకుని తన సోదరుడిని గెలిపించేందుకు ఆమె కష్టపడుతూ ఉన్నారు!