Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్లో ప్రియాంక‌..నా భార్య‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి

By:  Tupaki Desk   |   11 Feb 2019 1:16 PM GMT
ట్విట్ట‌ర్లో ప్రియాంక‌..నా భార్య‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి
X
కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి ప్రియాంకాగాంధీ త‌న ముద్ర‌ను కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఆమె ట్విటర్‌ లో అడుగుపెట్టారు. ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆమె ట్విటర్‌ అకౌంట్‌ ను క్రియేట్ చేశారు. @priyankagandhi పేరుతో ఆమె ట్విటర్ అకౌంట్ యాక్టివేట్ అయింది. తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ అకౌంట్‌ గా ట్విటర్ గుర్తించడం విశేషం. ఆమెకు ట్విటర్‌ లో రాత్రి నుంచి ఉదయం వరకు 15 వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇప్పటివరకైతే ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంకా ట్విటర్‌ లో అడుగుపెట్టిన విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఆమెను ట్విటర్‌ లో ఫాలో కావచ్చని ట్వీట్ చేసింది.

ఇదిలాఉండ‌గా, ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా చేసిన ఓ ఫేస్‌ బుక్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో అతడు ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఆయ‌న కీల‌క పోస్ట్ పెట్టారు. రాజకీయాల్లోకి వెళ్లిన తన భార్యకు శుభాకాంక్షలు చెబుతూనే... ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ``నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌ వి. ఉత్తమైన భార్యవి. మన పిల్లలకు మంచి తల్లివి. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నీకు బెస్ట్ విషెస్. అయితే ప్రస్తుతం దుర్మార్గపు, విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవ చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆమెను దేశ ప్రజల చేతుల్లో పెడుతున్నాను. మీరే జాగ్రత్తగా చూసుకోండి`` అంటూ ఫేస్‌ బుక్‌ లో రాబర్ట్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

ఇదిలాఉండ‌గా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇటీవ‌ల ఈస్ట్ యూపీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్రియాంకా గాంధీ ల‌క్నోలో జ‌రిగిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం, వెస్ట్ యూపీ చీఫ్‌ జ్యోతిరాధిత్య సింథియా కూడా పాల్గొన్నారు. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ప్రియాంకా.. తొలిసారి ర్యాలీలో పాల్గొన్నారు. ఈనెల 14వ తేదీ వ‌ర‌కు ప్రియాంకా.. ఈస్ట్ యూపీ నేత‌ల‌తో భేటీకానున్నారు. 42 నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వారితో ఆమె మాట్లాడ‌నున్నారు. రోడ్‌ షోకు భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు ప్రియాంకాకు స్వాగ‌తం పలికారు.