Begin typing your search above and press return to search.

సినిమాలకు కోట్లు.. మాంద్యమెక్కడిదా?

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:51 AM GMT
సినిమాలకు కోట్లు.. మాంద్యమెక్కడిదా?
X
దేశాన్ని ఆర్థికమాంద్యం చుట్టేసింది. మన జీడీపీ 6శాతానికే పరిమితమైందని స్వయంగా ప్రపంచబ్యాంకు కుదించేసింది. దేశంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు మాంద్యానికి చిన్నాభిన్నమవుతున్నాయి. మాంద్యం దెబ్బకు ఐటీ సహా వివిధ సేవల రంగాల్లోని ఉద్యోగాలు హారతి కర్పూరం అయిపోతున్నాయి. ఇంతటి క్లిష్ట సమయం కావడంతో ఆటో,మొబైల్ రంగ పరిశ్రమలు కూడా కుదేలయ్యాయి.

ఈ విపత్కర పరిస్థితులను చూసే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దీపనలను భారీగా ప్రకటించింది. ఆటోమొబైల్ పరిశ్రమలకు భారీ రాయితీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అయితే మాంద్యం ఇలా అందరి కళ్లకు కట్టేలా ముందున్నా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రం ఇటీవల ఢిల్లీలో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఇటీవల అక్టోబర్ 2న విడుదలైన మూడు సినిమాలు సైరా, వార్, జోకర్ లు ఒక్కరోజులోనే 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయని.. దేశంలో మాంద్యం లేదనడానికి ఆ సినిమాల కలెక్షన్లే నిదర్శనమని రవిశంకర్ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు.

తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కామెంట్స్ కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని పీడిస్తున్న మాంద్యాన్ని సినిమాలతో పోలుస్తారా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి సినిమా ప్రపంచం నుంచి బయటకు వచ్చి వాస్తవ ప్రపంచంలోకి రావాలని ఆమె సూచించారు. దేశంలో ఆర్థిక మాంద్యం వల్ల పలు రంగాల్లో లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. ప్రజల డబ్బులను బ్యాంకులు స్తంభింపచేస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఆందోళన బాధ పట్టని ప్రభుత్వం సినిమాలను చూపించి మాంద్యాన్ని తగ్గిస్తోందని ఆమె ఫైర్ అయ్యారు.