Begin typing your search above and press return to search.

ఏపీ ప్రత్యేక హోదా ప్రింట్ మీడియాకు పట్టదా?

By:  Tupaki Desk   |   5 May 2016 6:02 AM GMT
ఏపీ ప్రత్యేక హోదా ప్రింట్ మీడియాకు పట్టదా?
X
అసలోడికే లేని నొప్పి కొసరోడుకి ఎందుకుంటుందన్న చందంగా ఉంది ఏపీ పరిస్థితి. విభజన నేపథ్యంలో ఏపీకి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో సీమాంధ్రప్రజలు మోడీ సర్కారు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చిన పక్షంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏపీకి తరలి రావటంతో పాటు.. అభివృద్ధి సైతం రేసుగుర్రంలా దూసుకెళుతుందన్న వాదన ఉంది.

దీనికి తగ్గట్లే విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా రాజ్యసభలో హామీ ఇవ్వటం.. సార్వత్రిక ఎన్నిక సమయంలో ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న మోడీ స్వయంగా మాట ఇచ్చిన నేపథ్యంలో విభజన కారణంగా జరిగిన నష్టం త్వరగానే భర్తీ అవుతుందన్న భావన ఏపీ ప్రజల్లో నెలకొంది. అయితే.. సీమాంధ్ర ప్రజల ఆశలకు.. ఆకాంక్షల్ని పెద్దగా పట్టించుకోని మోడీ సర్కారు.. తన రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది తప్పించి ఏపీ గురించి అస్సలు పట్టించుకోలేదు. ఏపీకి ప్రత్యేకహోదా లేదన్న విషయాన్ని బుధవారం లోక్ సభలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి.

ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురైన పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు అనుసరించిన వైఖరిపై తెలుగు టీవీ ఛానళ్లు ఒకట్రెండు తప్పించి మిగిలినవన్ని బాగానే రియాక్ట్ అయిన పరిస్థితి. ఏపీకి ద్రోహం అని.. బాబుకు మోడీ టోపీ అని.. ఇలాంటి ప్రత్యేక శీర్షికలు పెట్టి ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు హ్యాండ్ ఇవ్వటాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

ఇదిలా ఉంటే.. టీవీ ఛానళ్ల వైఖరికి పూర్తి భిన్నంగా తెలుగు దినపత్రికలు కాస్త భిన్నంగా వ్యవహరించటం గమనార్హం. తెలుగులో ప్రముఖ దిన పత్రికలైన ఈనాడు విషయానికి వస్తే.. తన ఏపీ ఎడిషన్ లో ప్రాజెక్టుల మీద సీఎం చంద్రబాబు రియాక్ట్ అయిన వార్తను ప్రధాన వార్తగా వేసి.. దాని కిందన ‘‘చట్టంలోనే లేదు’’ అంటూ ప్రత్యేక హోదా ఇవ్వటం లేదన్న మాటను లేకుండా అచ్చేయటం కనిపిస్తుంది. ఇక.. సాక్షి విషయానికి వస్తే కాస్త మెరుగ్గా.. ‘‘హోదా ఆశకు సమాధి’’ అన్న శీర్షికతో ప్రముఖంగానే ప్రచురించింది. ఇక.. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే.. ‘‘హోదా లేదు’’ అన్న హెడ్డింగ్ తో ప్రముఖంగానే ముద్రించింది. కానీ.. ఈ మూడు దినపత్రికల్లో సాక్షి మినహా మిగిలిన రెండు ప్రధాన పత్రికల్లో ఏపీకి కేంద్రం చేయించిందన్న విషయం పెద్దగా ఫోకస్ చేయకపోవటం గమనార్హం.

తెలుగు దినపత్రికల తీరు ఇలా ఉంటే.. ఇంగ్లిషు దినపత్రికలైన.. టైమ్స్ ఆఫ్ ఇండియా.. దక్కన్ క్రానికల్.. ది హిందూ.. ఇండియన్ ఎక్స్ ప్రెస్.. ద ఎకనామిక్స్ టైమ్స్.. బిజినెస్ లైన్ ఏమీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన నష్టాన్ని ప్రముఖంగా ఇవ్వకపోవటం గమనార్హం. తెలుగు ప్రజల కోసం నిత్యం వార్తలు అందించే తెలుగు దినపత్రికలే ఏపీ ప్రాంతానికి అచ్చేసే ఎడిషన్లో ప్రత్యేక హోదా మీద ఇచ్చిన ప్రాధాన్యత ఒక మాదిరిగా ఉంటే.. ఇంగ్లిష్ దినపత్రికలకు ఏం పడతాయి? మొత్తంగా చూస్తే.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరును తప్పు పట్టే విషయంలో ప్రింట్ మీడియాతో పోలిస్తే.. టీవీ ఛానళ్లే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.