Begin typing your search above and press return to search.

సొంతోళ్ల‌పై మోడీ మార్పు కొర‌డా?

By:  Tupaki Desk   |   17 Aug 2017 4:18 AM GMT
సొంతోళ్ల‌పై మోడీ మార్పు కొర‌డా?
X
మూడున్న‌రేళ్ల పాల‌న ముగిసింది. ఇంకొక్క ఆర్నెల్లు గ‌డిస్తే సార్వ‌త్రిక ఫీవ‌ర్ వ‌చ్చేసిన‌ట్లే. ఇలాంటి వేళ‌.. మార్పు కొర‌డాను ప్ర‌ధాని మోడీ ఝుళిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు.. కొన్ని మార్పులు చేర్పులు.. ప‌ద‌వీకాలం పూర్తి అయిన నేప‌థ్యంలో క్యాబినెట్ లో ఖాళీల‌తో పాటు.. వివిధ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో క్యాబినెట్ లో ప‌ని తీరు స‌రిగా లేని మంత్రుల‌పై వేటు వేయ‌టం ద్వారా.. త‌న టీంను అలెర్ట్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌ధాని మోడీ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

పార్ల‌మెంటు స‌మావేశాలు పూర్తి అయిన నేప‌థ్యంలో ఇక పాల‌నా ప‌ర‌మైన మార్పులపై మోడీ దృష్టి సారించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో గుజ‌రాత్‌.. వ‌చ్చే ఏడాది హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌..క‌ర్ణాట‌క తో స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో భారీ ఎత్తున క్యాబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో పాటు.. ఖాళీ కానున్న గ‌వ‌ర్న‌ర్ పోస్టుల‌కు కొత్త‌వారిని ఎంపిక చేసే అంశాల మీద మోడీ దృష్టి పెట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ క‌స‌ర‌త్తును వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా జ‌రిగే మార్పులు.. చేర్పుల‌న్నీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొనే జ‌రుగుతుందంటున్నారు.

ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు కూడా తాజా మార్పుల్లో ప్ర‌ముఖంగా క‌నిపిస్తాయ‌ని చెబుతున్నారు. బీహార్ లో జేడీయూతో చెట్టాప‌ట్టాల‌తో అధికార ప‌క్షంగా అవ‌త‌రించ‌టంతో ఆ పార్టీకి చెందిన వారు కేంద్ర క్యాబినెట్ లో స్థానం ద‌క్కించుకోవ‌టం ఖాయ‌మంటున్నారు. ఇక‌.. త‌మిళ‌నాడులో అధికార ప‌క్షం అధికారికంగా ఎన్డీయేలో చేర్చే ప్రక్రియ మిగిలింది. దాన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి.. ఆ పార్టీకి చెందిన వారిని త‌న క్యాబినెట్ లో చోటు ఇవ్వాల‌ని మోడీ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. వీటితో పాటు.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని చేప‌ట్టిన మాజీ కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు.. అరుణ్ జైట్లీ వ‌ద్ద అద‌నంగా ఉన్న ర‌క్ష‌ణ‌శాఖ‌తో పాటు.. దివంగ‌త మంత్రి అనిల్ ద‌వే నిర్వ‌హించిన మంత్రిత్వ శాఖ‌ల్ని భ‌ర్తీ చేయాల్సి ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌న క్యాబినెట్ లో స‌రైన ప‌నితీరు చూపించ‌ని మంత్రుల‌పై వేటు వేసే దిశ‌గా మోడీ అడుగులు వేస్తున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి క‌స‌ర‌త్తు పూర్తి అయ్యింద‌ని.. తాజా మార్పుల్లో కొంద‌రిపై వేటు ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌.. క్యాబినెట్ లోకి కొత్త‌గా తీసుకునే వారి విష‌యంలో మోడీ జాగ్ర‌త్త‌లు తీసుకోనున్న‌ట్లు చెబుతున్నారు. వివాదాల‌కు కేంద్ర‌బిందువులుగా ఉండే వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ లేదంటున్నారు.

మ‌రి..క్యాబినెట్ లో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌న్న అంశానికి వస్తే.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఒక‌టి వినిపిస్తోంది. ఈసారి ఏపీకి చెందిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ కు కానీ.. విశాఖ ఎంపీ హ‌రిబాబుకు కేంద్ర‌మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో జేడీయూ.. అన్నాడీఎంకేల‌కు ఒక్కొక్క ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉందంటున్నారు.

మంత్రివ‌ర్గ మార్పుల‌తో పాటు.. ప‌లు రాష్ట్రాల్లో ఖాళీ అయిన గ‌వ‌ర్న‌ర్ పోస్టుల భ‌ర్తీ అంశంపైనా మోడీ దృష్టి సారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. తెలంగాణ‌.. త‌మిళ‌నాడు.. బీహార్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. మేఘాల‌య రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. వీటితో పాటు కేంద్ర ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ లో ఖాళీగా ఉన్న ఒక స్థానాన్ని భ‌ర్తీ చేయ‌టంతో పాటు.. నీతి అయోగ్ కొత్త స‌భ్యులు.. బ్యాంకుల‌కు నామినేటెడ్ పోస్టులు.. ఎస్సీ..ఎస్టీ.. మైనార్టీ ప‌ద‌వుల‌నూ వీలైనంత త్వ‌ర‌గా మోడీ భ‌ర్తీ చేస్తార‌ని చెబుతున్నారు.