Begin typing your search above and press return to search.

హోం శాఖను కాదని ప్రణబ్ అరుదైన నిర్ణయం

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:18 AM GMT
హోం  శాఖను కాదని ప్రణబ్ అరుదైన నిర్ణయం
X
రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న అపప్రద ఒకటి చాలామందిలో ఉంటుంది. కీలకమైన సమయాల్లో రాష్ట్రపతి నిర్ణయాత్మకంగా వ్యవహరించే వెసులుబాటు ఉండటమే కాదు.. ఆయనే కీలకంగా వ్యవహరించే సందర్భాలు కొన్ని ఉంటాయి. తనకున్న విచక్షణాధికారంతో అరుదైన నిర్ణయాలు తీసుకునే వీలుంది. కాకుంటే.. ఇలాంటి వాటి జోలికి ఏ రాష్ట్రపతి పెద్దగా వెళ్లరు.

రాజకీయాల్లో తల పండిన ప్రణబ్ దా రాష్ట్రపతిగా నియామకం అయిన వెంటనే.. ఆయన తీరు ఈ మధ్యకాలంలో రాష్ట్రపతులుగా వ్యవహరించిన వారి కంటే భిన్నంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొదట్లో వినిపించినంత స్థాయిలో కాకున్నా.. అప్పుడప్పుడు తనదైన శైలిని ప్రణబ్ దా ప్రదర్శించారనే చెప్పాలి. తాజాగా ఆయన ఒక అరుదైన నిర్ణయాన్ని తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారంతో ఉరిశిక్ష పడిన ఖైదీలకు యావజ్జీవ కారాగార శిక్షగా క్షమాభిక్ష పెట్టే వీలున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి వీలుగా కేంద్ర హోం శాఖ సిఫార్సుల్ని చేస్తుంది. తాజాగా.. వాటిని పక్కన పెట్టి మరీ.. నలుగురు ఖైదీలకు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

1992లో బిహార్ లో అగ్రవర్ణాలకు చెందిన 34 మందిని హత్య చేసిన కేసులో కృష్ణ మోచీ.. నస్హే లాల్ మోచీ.. బిర్ క్యూర్ ఫాశ్వాన్.. ధర్మేంద్ర సింగ్ లకు 2001లో సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే.. వీరికి క్షమాభిక్ష ప్రసాదించాలని బీహార్ ప్రభుత్వం ఒక పిటీషన్ దాఖలు చేసింది. వీటిని కేంద్ర హోంశాఖ గత ఏడాది ఆగస్టు 8న తిరస్కరించింది. అయితే.. క్షమాభిక్ష పిటిషన్లను పరిశీలించే విషయంలో జరిగిన జాప్యాన్ని లెక్కలోకి తీసుకున్న రాష్ట్రపతి తనకు తాను సొంతంగా క్షమాభిక్షను ప్రసాదించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/