ఎలక్షన్ పై జగన్ కీలక వ్యాఖ్య..!

Thu Oct 12 2017 11:53:13 GMT+0530 (IST)

గడిచిన కొంత కాలంగా సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. మరో ఏడాదిన్నర సమయం సార్వత్రిక ఎన్నికలకు  ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే రాష్ట్రాల రాజకీయాలు కూడా వేడెక్కిపోతున్నాయి.దాదాపు తొమ్మిది నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న మాట పలువురి నోట వస్తోంది. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు అందిన సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న మాటను చెప్పారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే అక్టోబరులోనే సార్వత్రిక ఎన్నికలకు వచ్చే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటిని ఎదరర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని.. 175 నియోజకవర్గాల్లోనూ పార్టీని సంపూర్ణంగా సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

ముందస్తు ఎన్నికల మీద ఏపీ ముఖ్యమంత్రి కూడా ఇటీవల సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. ముందుగానే ఎన్నికలు జరిగే వీలుందని చెప్పక తప్పదు. విపక్ష నేత నోటి నుంచి సైతం ముందస్తు మాట వచ్చిన నేపథ్యంలో.. ఎలక్షన్ ఫీవర్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని ఆవహించినట్లేనని చెప్పక తప్పదు.