Begin typing your search above and press return to search.

'ట్రంప్' కార్డు పనిచేస్తోందా?

By:  Tupaki Desk   |   22 Oct 2016 10:04 AM GMT
ట్రంప్ కార్డు పనిచేస్తోందా?
X
నోటి దురుసు - వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సొంత పార్టీ మద్దతు కూడా పోగొట్టుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తగ్గిపోయాయని చాలామంది అనుకుంటున్న తరుణంతో తాజా సర్వేలు ఆయనలోని ఆశలకు మళ్లీ జీవం పోస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావొచ్చని.. ట్రంప్ గ్రాఫ్ పెరుగుతోందని చెబుతున్నాయి. దీంతో హిల్లరీ శిబిరంలో దడ మొదలైందటున్నారు.

రాయిటర్స్ వార్తా సంస్థ అమెరికా ఎన్నికలపై సంచలనాత్మక సర్వే ఫలితాలను వెల్లడించింది. సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి ఇటీవల కాలంలో భారీగా గండికొట్టినట్లు తేలింది. ఎన్నికల్లో అక్రమాలు(రిగ్గింగ్) జరుగుతున్నాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని అమెరికన్లు నమ్ముతున్నారని శుక్రవారం విడుదలైన రాయిటర్స్-ఇప్సో సర్వే ఫలితాల్లో తేలింది.

తాజా సర్వే ప్రకారం ఈ నెల 14 నుంచి 20 మధ్య కాలంలో ట్రంప్ తన ఆధిక్యతను 40 శాతం నుంచి 44 శాతానికి పెంచుకోగా.. హిల్లరీ ఆధిపత్యానికి భారీగా తగ్గించగలిగారని సర్వేలో పేర్కొన్నారు. అక్టోబర్ 7-13 మధ్య హిల్లరీకి 44 శాతం - ట్రంప్ కు 37 శాతం మద్దతు దక్కింది. నిజానికి జాతీయ సరాసరిలో ఇప్పటికీ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ కు 41.9 శాతం మద్దతు లభిస్తే అతని కంటే 6.2 శాతం ఎక్కువ అంటే, 48.1 శాతం ఆధిక్యత హిల్లరీకి ఉంది. పోలింగ్ కు ఇంకా రెండు వారాలు గడువుండటంతో ట్రంప్ పైచేయి సాధిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ట్రంపుపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నా కూడా అదే సమయంలో ఆయన చెబుతున్న రిగ్గింగు ఆరోపణలనూ నమ్ముతున్నారట. తాజా సర్వేలు - పరిణామాలతో హిల్లరీ శిబిరంలో కంగారు మొదలైందని చెబుతున్నారు. మొత్తానికి అన్ని ప్రయత్నాలు చేసి చివరిగా రిగ్గింగ్ ఆరోపణలకు దిగిన ట్రంప్ కార్డు బాగానే పనిచేస్తున్నట్లుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/