Begin typing your search above and press return to search.

లేని అమ‌రావ‌తిని అడ్డుకోవ‌డ‌మేమిటి త‌మ్ముళ్లూ?

By:  Tupaki Desk   |   30 July 2018 10:50 AM GMT
లేని అమ‌రావ‌తిని అడ్డుకోవ‌డ‌మేమిటి త‌మ్ముళ్లూ?
X
ఆలూ లేదు...చూలూ లేదు.....కొడుకు పేరు సోమ‌లింగం....అని వెన‌క‌టికి ఓ సామెత ఉంది. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత చంద్ర‌బాబు - టీడీపీ నేత‌ల‌కు ఆ సామెత బాగా వ‌ర్తిస్తుంది. అస‌లు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించ‌కుండానే....దానిని అడ్డుకుంటున్నార‌ని టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు హాస్యాస్పదంగా ఉన్నాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ చంద్ర‌బాబు....గ‌త నాలుగేళ్లుగా అర‌చేతిలో వైకుంఠం చూపుతున్న వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు .....అమ‌రావ‌తిపై చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ - జనసేనల‌ కలిసి కుట్రలు చేస్తున్నాయని పుల్లారావు ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టేలా పవన్‌ కల్యాణ్ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్నారు. చంద్రబాబుపై నమ్మకంతో వేల ఎకరాల‌ను రైతులు స్వ‌చ్చందంగా ఇచ్చార‌ని - ఆ నమ్మకాన్ని ప‌వ‌న్ చెడగొడుతున్నార‌ని అన్నారు. రాజధాని రావడం వల్లే అక్క‌డ‌ భూముల‌కు కోట్ల రూపాయల ధ‌ర ప‌లికింద‌న్నారు. ప‌వ‌న్ రాజధాని పర్యటనల వెనుక కేంద్రం ఉంద‌ని ఆరోపించారు.

వాస్త‌వానికి - లోటు బ‌డ్జెట్ తో ఉన్నఅవ‌శేషాంధ్ర‌ప్ర‌దేశ్ ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తార‌న్న న‌మ్మ‌కంతోనే చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అయితే, గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు మాటలు నీటిమూట‌ల‌య్యాయ‌న్న‌ది బ‌హిరంగం ర‌హ‌స్య‌మే. అర‌చేతిలో అమ‌రావ‌తిని చూపిస్తున్న చంద్ర‌బాబు.....ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు. హైద‌రాబాద్ ను మించిన రాజ‌ధాని నిర్మిస్తానంటూ గొప్ప‌లు పోయిన చంద్ర‌బాబు...చిన్న‌పాటి వాన‌కు వ‌ణికిపోయే తాత్కాలికి స‌చివాల‌యాన్ని మాత్ర‌మే నిర్మించ‌గ‌లిగారు. కానీ, అమ‌రావ‌తి డిజైన్లంటూ...ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ప‌నామా పేప‌ర్స్ లాగా అమ‌రావ‌తి కూడా పేప‌ర్ల‌కే ప‌రిమిత‌మైన‌ట్లుంది. అదిగో అమ‌రావ‌తి...అంటూ ఇప్ప‌టికే `బాహుబ‌లి`ని త‌ల‌ద‌న్నే రీతిలో గ్రాఫిక్స్ తో అమ‌రావ‌తి టీజ‌ర్లు - ట్రైల‌ర్లు మాత్రం బాబు రిలీజ్ చేస్తున్నారు. అస‌లు అమ‌రావ‌తి క‌థ మొద‌లే కాలేదు. అటువంటి స‌మ‌యంలో ...పుల్లారావు చేసిన వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దంగా మారాయి. అస‌లు ఏం నిర్మించార‌ని....ఎవ‌రో అడ్డుకుంటారంటూ పుల్లారావు బెంగ‌ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేదు. నిర్మించ‌ని అమ‌రావతిని ఎవ‌రో అడ్డుకుంటున్నార‌న్న భ్ర‌మ‌లో నుంచి తెలుగు త‌మ్ముళ్లు బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. బ‌హుశా ఇదంతా చంద్ర‌బాబు ప్ర‌భావం కావ‌చ్చని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.