Begin typing your search above and press return to search.

అధినేత సందిగ్ధతే.. మంత్రుల మాటల్లో కూడా!

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:43 PM GMT
అధినేత సందిగ్ధతే.. మంత్రుల మాటల్లో కూడా!
X
తెలుగుదేశం పార్టీ ఇంకా ఎంతగా మాటల గారడీతో ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. ఆ పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం పార్టీ శ్రేణులతో మంత్రులతో టచ్ లో ఉంటూ ఏయే యాంగిల్లో మీడియాతో మాట్లాడాలో.. ఏయే అంశాలను తాము ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదో మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఆయన స్క్రిప్టు ప్రకారమే మంత్రులు బయట మాట్లాడుతూ ఉంటారని ప్రజలు అనుకుంటూ ఉంటారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా సహజమైన శైలిలో.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా అన్యాయానికి గురైందో.. కేంద్రం ఏ విధంగా మోసం చేసిందో.. చంద్రబాబునాయుడు ఎంతగా కష్టపడి పరిస్థితిని చక్కదిద్దడానికి పాటుపడుతున్నారో.. తన శక్తివంచన లేకుండా చెప్పుకొచ్చారు. మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర ప్రభుత్వంపై ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఆ క్షణంలోనే నాలిక్కరుచుకుంటూ.. అయినా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చునని మంత్రిగారు సెలవిచ్చారు.

మొత్తానికి ఆయన మాటలను బట్టి.. అవిశ్వాసం విషయంలో కూడా ఏదో జనాంతికంగా చెప్పడమే తప్ప.. తెలుగుదేశం పార్టీ అధినేత ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేదని అనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు విషయానికి వస్తే కేవలం అవిశ్వాసం విషయంలో మాత్రమే కాదు.. ఆయన ఇప్పటికీ ప్రత్యేకహోదా అడిగి పరువు కాపాడుకోవాలా? ప్రత్యేక ప్యాకేజీకే పట్టుబట్టి హోదా అనే ప్రజల ఆశలను సమూలంగా తొక్కేయాలా? అనే విషయంలో కూడా ఆయన ఇంకా ఎటూ తేల్చుకోలేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

అధినేతలోని సందిగ్ధానికి తగ్గట్లుగానే మంత్రులు కూడా కర్ర విరగకుండా పాము చావకుండా - తాము అవిశ్వాసానికి దూరం అనకుండా, పెడతాం అంటూనే.. భాజపాకు కోపం రాకుండా.. అంత పరిస్థితులు రావులే.. అని సన్నాయి నొక్కులు నొక్కుతూ రోజులు నెట్టేస్తుండడం చూసి.. మళ్లీ ఏం ఉపద్రవం తెచ్చి పెడతారో అని ప్రజలు భయపడుతున్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భాజపా మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసే ప్రసక్తే లేదని.. అలాంటి వారిని తమ పార్టీ దగ్గరకు రానివ్వదని విధాన నిర్ణయాల్ని తానే ప్రకటించేయడం విశేషం.