Begin typing your search above and press return to search.

ప్ర‌త్తిపాటి ఎట్ట‌కేల‌కు నిజం ఒప్పుకొన్నాడు

By:  Tupaki Desk   |   25 March 2017 4:22 AM GMT
ప్ర‌త్తిపాటి ఎట్ట‌కేల‌కు నిజం ఒప్పుకొన్నాడు
X
ఏపీలో ప్రారంభమై సుమారు ఐదు రాష్ర్టాలకు విస్త‌రించిన అగ్రిగోల్డ్ సంస్థ‌కు చెందిన‌ కుంభ‌కోణంలో ప‌లువురి పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ అత్యంత వివాదాస్ప‌దంగా మారిన వ్య‌క్తి ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు!. విప‌క్షాల‌న్నీ ప్ర‌త్తిపాటిని టార్గెట్ చేసుకొని ఏపీ స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేశాయి. ఒక‌దశ‌లో ఏపీ సీఎం - టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఇక ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మావేశాల్లో ఏకంగా వ‌రుస‌గా రెండు రోజుల పాటు స‌భ ద‌ద్ద‌రిల్లింది. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అయితే త‌న‌కు 20 నిమిషాల స‌మ‌యం ఇస్తే చాలు అన్నీ నిరూపిస్తాన‌ని చెప్పారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఎట్ట‌కేల‌కు త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ప్రత్తిపాటి అంగీకరించారు. ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్నట్లు అగ్రిగోల్డు డైరెక్టర్ దినకర్ దగ్గర ఆస్తులు కొనుగోలు చేసింది వాస్తవమేనని ప్రత్తిపాటి పుల్లారావు ఒప్పుకున్నారు.

అసెంబ్లీ వాయిదా ప‌డిన అనంత‌రం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్ర‌త్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై మండిప‌డ్డారు. అగ్రిగోల్డ్ డైరెక్ట‌ర్ నుంచి భూములను న్యాయబద్ధంగా కొనుగోలు చేశామని చెప్పిన పుల్లారావు త‌న‌కు భూములు అమ్మాల్సింది ఎవరిని భయపెట్టలేదని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లును ఆయన ప్రదర్శించారు. అగ్రిగోల్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినకర్ దగ్గర అస్తులు కొన్న విషయం వాస్తవమేనని అంగీక‌రించారు. దిన‌క‌ర్ అగ్రిగోల్డుకు సంబంధించి షేర్ హోల్డర్-ప్రమోటర్ కూడా కాదని, ఆయనకు అగ్రిగోల్డు ఆస్తులకు సంబంధం లేదని పుల్లారావు చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. నకిలీ పత్రాలను సృష్టించడం వైకాపా నేతలకు కొత్త కాదని తప్పుడు పత్రాలతో శాసన సభా గౌరవానికి భంగం కలిగిస్తున్నారని పుల్లారావు మండిప‌డ్డారు.

త‌న కుటుంబాన్ని రోడ్డుకీడ్చేందుకు జగన్ అండ్ కో గత మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉందని ప్ర‌త్తిపాటి పుల్లారావు మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత చేసిన ఆరోప‌ణ‌ల విష‌యంలో ఇప్పటికీ వారు కోరిన ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అన్నారు. అగ్రిగోల్డు అస్తుల వేలం విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్డు ఆదేశాల మేరకు బాధితులందరికీ సమాన న్యాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డు ఆస్తుల్లోని చిన్న చిన్న వాటిని వేలం వేసి బాధితులకు మందుగా పంచాలని కోర్టు సూచించిందని, దీనిలో భాగంగానే ఇంకా హాయ్‌లాండ్‌ను వేలం వేయలేదని తెలిపారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడని, ప్రజాస్వామ్య ముసుగులో నేడు అరాచకాలకు పాల్పడుతున్నారని ప్ర‌త్తిపాటి పుల్లారావు విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/