Begin typing your search above and press return to search.

దళితుల ఓట్లపై బాబు ఆశలు వదులుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   23 July 2017 8:09 AM GMT
దళితుల ఓట్లపై బాబు ఆశలు వదులుకోవాల్సిందేనా?
X
ఏపీలో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేయిస్తున్న సర్వేలు టీడీపీలో దడ పుట్టిస్తున్నాయి. దళితుల విషయంలో పెట్టుకున్న ఆశలు ఆవిరైన విషయం టీడీపీ గుర్తించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఏపిలోని మాలలు కాంగ్రెస్ వైపు, మాదిగలు టిడిపి వైపు.. తెలంగాణలో మాదిగలు టిడిపి - మాలలు కాంగ్రెస్ వైపు ఉండేవారు. విభజన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన మాల వర్గ నేతలు ప్రత్యామ్నాయంగా టిడిపిలో చేరారు. టిడిపి నాయకత్వం కూడా ఏపిలో మాదిగ సంఖ్యాబలం తక్కువ అన్న భావనతో, తొలిసారిగా పార్టీ వైపు మొగ్గుచూపిన మాలలను ఓటు బ్యాంకుగా మలచుకోవాలని నిర్ణయించింది. దానితో సంప్రదాయ మద్దతుదారులయిన మాదిగలను పక్కకుపెట్టి గత మూడేళ్లుగా పార్టీ-ప్రభుత్వంలో మాలలకు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఆ తీరే రెండు వర్గాలకూ దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోది.

అయితే, తాజాగా వైసీపీ కన్సల్టెంట్ ప్రశాంత్‌ కిశోర్ వివిధ ప్రాంతాల్లో చేయిస్తున్న సర్వేలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్తున్నారు. మాలలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మాల వర్గానికి చెందిన నేతలకు టిడిపి మంత్రి పదవులు - ఎమ్మెల్సీ - కార్పొరేషన్ చైర్మన్ పదవులిస్తున్నప్పటికీ, ఆ వర్గంలో మెజారిటీ శాతం ఇప్పటికీ వైసీపీ వైపే ఉందని ఆ సర్వే ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో తొలి నుంచీ టిడిపికి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న మాదిగలు తమను నిర్లక్ష్యం చేశారన్న కోపంతో టీడీపీ నుంచి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్వే ప్రాధమిక ఫలితాల బట్టి దళితులపై దేశం నాయకత్వం అంచనాలు తప్పినట్లు స్పష్టమవుతోంది.