Begin typing your search above and press return to search.

హీరో రాజకీయ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు!

By:  Tupaki Desk   |   24 Aug 2019 1:30 AM GMT
హీరో రాజకీయ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు!
X
ఇటీవలే ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ కు మరో రాజకీయ పార్టీతో ఒప్పందం కుదిరింది. ఏపీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయంతో పీకే స్ట్రాటజీలకు మరింత డిమాండ్ పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా మరికొన్ని పార్టీలు పీకే మీద దృష్టి పెట్టాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీతో పీకే టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తమిళనాట కమల్ హాసన్ కూడా ఐప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ తమళనాట పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు అప్పటికప్పడు హడావుడిగా రాజకీయాల్లోకి వెళ్లాడు కమల్. పెద్దగా గ్రౌండ్ వర్క్ లేదు. టార్చ్ లైట్ గుర్తుతో కమల్ పోటీ చేశాడు. అయితే ఎక్కడా నెగ్గుకు రాలేకపోయింది ఆ పార్టీ. కొద్ది మేర ఓట్ల శాతం అయితే సంపాదించింది. నాలుగైదు శాతం ఓట్లతో కమల్ పార్టీ తన ఉనికిని చాటింది.

ఈ నేపథ్యంలో తన పార్టీ కార్యక్రమాలను మరింత జోరెక్కించాలని కమల్ భావిస్తున్నాడు. అందుకే ఐ ప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ కు వివిధ సలహాలు, సూచనలు ఇస్తున్నారట ప్రశాంత్ కిషోర్. తన పార్టీని ఆమ్ ఆద్మీ తరహాలో, అవినీతి వ్యతిరేక నినాదంతో బరిలోకి దించాలనేది కమల్ ఆలోచన.

కమల్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కొద్ది మేర ఓట్లు పడింది కూడా పట్టణ ప్రాంతాల్లోనే. ఇలాంటి నేఫథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి నగరాల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం, పట్టణాల్లో కూడా ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా నిర్మాణాన్ని సాగించాలని కమల్ కు సూచించారట పీకే. ఈ మేరకు పీకే టీమ్ మరింతగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉందని, మరో రెండేళ్లలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి తగినట్టుగా మక్కల్ నీది మయ్యం పార్టీని తీర్చిదిద్దడానికి పీకే టీమ్ ప్రయత్నాలు సాగిస్తోందని సమాచారం.