ఆ సీఎంపై రాష్ర్టపతి ప్రశంసలు

Fri May 19 2017 12:00:47 GMT+0530 (IST)

రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సాధారణంగా గుంభనంగా ఉంటారు. పైగా ఇపుడు అత్యున్నత పదవిలో ఉన్నారు. అయినా ఆయన లక్షణానికి భిన్నంగా తన మనసులో మాట చెప్పేశారు. తన సొంత రాష్ర్టం పశ్చిమ్ బెంగాల్ లో ఇంతవరకు ఏ సీఎం కూడా చేయనంతగా ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంచి పనులు చేస్తున్నారని కితాబిచ్చారు.  మమత సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని ఆయన ప్రశంసలు కురిపించారు.
    
ఆరోగ్యం విద్య తదితర రంగాల్లో మమత ప్రభుత్వం అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోందని ప్రణబ్  అన్నారు. వైద్య ఖర్చులను సామాన్యుడు భరించలేని స్థితిలో ఉన్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వెంటనే మమత చాలా వేగంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
    
గత 50 ఏళ్లుగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో తాను ఉన్నానని... రాష్ట్రపతి అయ్యాక కూడా తాను చాలా సార్లు రాష్ట్రానికి వచ్చానని... నేను చూసిన గత ప్రభుత్వాల కంటే మమత ప్రభుత్వమే మెరుగైన పాలన అందిస్తోందని చెప్పారు. వయసులో తన కంటే చిన్నదైన మమతను తాను ఆశీర్వదిస్తున్నానని తెలిపారు. ఎలాంటి చింత లేకుండా ముందుకు వెళ్లండి... ఆ భగవంతుడే మీకు సహాయం చేస్తాడని మమతను దీవించారు.  కాలేయ వ్యాధుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ డైజెస్టివ్ సైన్సెస్ ను నిన్న రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మమత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/