Begin typing your search above and press return to search.

మోడీకి ప్రణబ్ దా షాకిచ్చారా?

By:  Tupaki Desk   |   31 Aug 2016 9:30 AM GMT
మోడీకి ప్రణబ్ దా షాకిచ్చారా?
X
కేంద్రంలోని మోడీ సర్కారు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. లోక్ సభలో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేదన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఘన విజయం నేపథ్యంలో.. అనంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. మిత్రపక్షాలు తమ సత్తా చూపిస్తాయని అంచనా వేశారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా రాజ్యసభలో బలం పెంచుకోవచ్చని భావించినా.. అందుకు భిన్నమైన ఫలితాలు ఎదురుకావటంతో మోడీ బ్యాచ్ కు ఇబ్బందికరంగా మారింది. పాలనాపరమైన మార్పుల కోసం కీలక చట్టాలు రూపొందించేందుకు రాజ్యసభలో బలం లేకపోవటం ఇబ్బందికరంగా మారింది.

దీంతో.. మోడీ సర్కారు రాష్ట్రపతికి ఉండే ప్రత్యేక అధికారాలపై దృష్టి పెట్టింది. పార్లమెంటులో చట్టాల్ని ఆమోదించుకోలేని పరిస్థితుల్లో.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా పనుల్ని పూర్తి చేసుకునే విధానాన్ని ఆశ్రయిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి విధానాల్ని ప్రభుత్వాలు అనుసరించినా.. అదే పనిగా ఆర్డినెన్స్ లు తీసుకురావటంపై మోడీ సర్కారు విమర్శల్ని ఎదుర్కొంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీకి రాష్ట్రపతి ప్రణబ్ దా రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. చట్టాలకు సంబంధించి మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్రపతి అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. యూపీఏ హయాంలో రాష్ట్రపతిగా నియమితులైన ప్రణబ్ దా.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ మోడీ సర్కారు ఇబ్బందిని గుర్తించి ఆర్డినెన్స్ ల రూపంలో రాజీ పడినట్లుగా చెబుతారు. ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టకుండా వీలైనంత వరకూ సంయమనం పాటించారన్న వాదనను పలువురు వినిపిస్తారు. అయితే.. దాన్నో అవకాశంగా తీసుకొని మోడీ సర్కారు ఇప్పటికి నాలుగుసార్లు ఆర్డినెన్స్ లపై సంతకాలు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చిందని చెబుతారు.

అయితే.. ప్రతిసారీ ఆర్డినెన్స్ ల మీద సంతకాలు పెట్టించే అంశంపై రాష్ట్రపతి తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతికున్న ప్రత్యేక అధికారాల్ని పదే పదే వాడుకోవటాన్ని ఆయన తొలిసారి ఆక్షేపించి.. తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఆర్డినెన్స్ తేవటం ఓకే అయినా.. దాన్నో అవకాశంగా వాడుకోవటంపై రాష్ట్రపతి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే నాలుగుసార్లు సంతకాలు పెట్టానని మరోసారి అలా చేయొద్దంటూ ప్రణబ్ దా ప్రధానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.

ప్రధానికి రాసిన లేఖలో.. ‘ప్రజాస్వామ్యాన్ని.. పార్లమెంటును ప్రశ్నించేలా ప్రతిసారీ ఆర్డినెన్స్ లు తేవొద్దు’’ అన్న తన మాటను సూటిగా.. స్పష్టంగా చెప్పినట్లుగా చెబుతున్నారు. తాజాగా 48 సంవత్సరాల నాటి ఎనిమీ ప్రాపర్టీ చట్టానికి సవరణలు చేస్తూ.. రూల్ 12ను వాడుకుంటూ క్యాబినెట్ ఆమోదం లేకుండా పంపిన ఆర్డినెన్స్ నేపథ్యంలో రాష్ట్రపతి తాజా నోట్ ను ప్రధానికి పంపినట్లుగా చెబుతున్నారు.

యుద్ధాల తర్వాత పాక్.. చైనాలకు వలస వెళ్లిన వారి ఆస్తులకు సంబంధించిన నిబంధనను ఆర్డినెన్స్ ద్వారా మార్చాలని ప్రధాని మోడీ భావించగా.. అందుకు రాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజా నోట్ పంపినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ అంశం లోక్ సభ ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఎన్డీయేకు తగినంత బలం లేకపోవటంతో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా తాను అనుకున్న పనిని పూర్తి చేయాలని ప్రధాని భావించారు. అయితే.. ప్రణబ్ దా అభ్యంతరం వ్యక్తం చేయటం ఆర్డినెన్స్ ల వ్యవహారంపై కొత్త చర్చ మొదలైనట్లుగా చెబుతున్నారు.