Begin typing your search above and press return to search.

వీడ్కోలు వేళ‌..మోడీకి భారీ పంచ్ వేసిన ప్ర‌ణ‌బ్‌

By:  Tupaki Desk   |   24 July 2017 4:45 AM GMT
వీడ్కోలు వేళ‌..మోడీకి భారీ పంచ్ వేసిన ప్ర‌ణ‌బ్‌
X
దేశంలోనే అత్యంత శ‌క్తింత‌మైన నేత‌గా ప్ర‌ధాని మోడీ అవిర్భ‌వించార‌న్న విష‌యాన్ని చెప్ప‌టానికి ఎలాంటి సందహానికి గురి కావాల్సిన అవ‌స‌రం లేదు. తానేం చేయాల‌నుకున్నానో దాన్నే చేసేందుకు ఆయ‌న వీస‌మెత్తు కూడా వెన‌క్కి త‌గ్గ‌టం లేదు. త‌న రాజ‌కీయ జీవితంలో త‌న‌కు ఎదురైన వాటికి సంబంధించి పాత బాకీల్ని అణాపైస‌ల‌తో స‌హా తీర్చేస్తున్న మోడీని సూటిగా విమ‌ర్శించే వారూ.. ఆయ‌న‌లోని త‌ప్పుల్ని వెతికి చూపించే మొన‌గాడు ఇప్పుడైతే లేడ‌ని చెప్పుకునే ప‌రిస్థితి నేడు ఉంది.

ఇలాంటి వేళ‌లో.. మోడీ చేత‌ల మీదుగా ఘ‌న‌మైన వీడ్కోలు అందుకుంటున్న రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ దా త‌న వీడ్కోలు వేళ‌.. మోడీకి ఊహించ‌ని రీతిలో పంచ్ వేశార‌ని చెప్పాలి. త‌న‌కు బ‌లం లేని వేళ‌.. రాజ్యాంగ ప‌రంగా త‌న‌కున్న చిన్న వెసులుబాటును ఆధారంగా చేసుకొని.. త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా పాల‌న సాగిస్తున్న మోడీ తీరును స‌తిమొత్త‌గా విమ‌ర్శ‌లు చేయ‌ట‌మే కాదు.. అన్ని తెలిసిన వారికి.. ఏం పంచ్ వేశాడ‌బ్బా అనిపించేలా ప్ర‌ణ‌బ్ దా తాజాగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో ఎంపీలంతా క‌లిసి ప్ర‌ణ‌బ్ దాకు వీడ్కోలు స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప్ర‌ణ‌బ్‌.. ప్ర‌ధాన‌మంత్రి హోదాలో మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరులో ఒక అంశాన్ని ప్ర‌స్తావించ‌ట‌మేకాదు.. స‌ద‌రు ప‌ద్ధ‌తి ఏ మాత్రం స‌రికాద‌న్న విష‌యాన్ని సూటిగా చెప్పేయ‌టం విశేషంగా చెప్పాలి.

లోక్ స‌భ‌లో బంప‌ర్ మెజార్టీ ఉన్న‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ‌లో మోడీ స‌ర్కారుకు బ‌లం లేద‌న్న విష‌యం తెలిసిందే. ఈ బ‌ల‌హీన‌త‌ను క‌ప్పి పెట్టుకొని.. త‌న‌కు న‌చ్చిన చ‌ట్టాల్ని చేసేందుకు వీలుగా.. ఆర్డినెస్సులు జారీ చేసే ప్ర‌క్రియ‌ను మోడీ అనుస‌రించ‌టం తెలిసిందే. చ‌ట్ట‌ప్ర‌కారంగా ఇదేమీ త‌ప్పుడు చ‌ర్య కాన‌ప్ప‌టికీ.. నైతికంగా చూసిన‌ప్పుడు ఇది స‌రైన తీరు కాదు. ప్ర‌జాస్వామ్యంలో ఆర్డినెస్సుల‌తో పాల‌న సాగించ‌టం స్వాగ‌తించాల్సిన వైఖ‌రి ఎంత మాత్రం కాదు. ఇదే విషయాన్ని గ‌తంలోనూ చెప్పిన ప్ర‌ణ‌బ్ దా.. తాజాగా తాను ప‌ద‌వి నుంచి దిగిపోయే వేళ‌లోనూ సూటిగా ప్ర‌స్తావించ‌టం ద్వారా.. మోడీ పాల‌న‌ను తాను పూర్తిగా ఆమోదించ‌లేద‌న్న విష‌యాన్ని చెప్పేశారు. ఆర్డినెన్స్ బాట ప‌ట్ట‌టం ద్వారా.. విప‌క్షాల్ని అధికార‌ప‌క్షం క‌లుపుకుపోవ‌టం లేద‌న్న విష‌యాన్ని ప్ర‌ణ‌బ్ దా దేశ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌క‌నే చెప్పేశారు. త‌ప్ప‌నిస‌రి.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే ఆర్డినెన్స్ లు వినియోగించాల‌ని తాను బ‌లంగా విశ్వ‌సిస్తాన‌ని.. సాధార‌ణ‌.. ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల్లో ఆర్డినెన్సు జారీపై ఆలోచించ‌కూడ‌ద‌న్న సూచ‌న‌ను చేశారు. రాజ‌కీయాల్లో విశేష అనుభ‌వం ఉన్న ప్ర‌ణ‌బ్ దా.. రాష్ట్రప‌తి హోదాలో బ‌హిరంగంగా చెప్పిన ఈ మాట మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న లోపాన్ని ఎత్తి చూప‌టంగా చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీ చేస్తున్న త‌ప్పుల్ని త‌ప్పు ప‌ట్టే కార్య‌క్ర‌మాన్ని అంద‌రూ విస్మ‌రిస్తున్న వేళ‌.. అత్యున్న‌త ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్న వేళ‌.. ప్ర‌ణ‌బ్ నోటి నుంచి రావ‌టం మోడీ లాంటి నేత‌కు ఇబ్బందిక‌ర‌మైన అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఏమైనా.. పెద్దాయ‌న ఆఖ‌ర్లో ఇచ్చిన పంచ్ మోడీకి ఒకింత షాక్ అనే చెప్పాలి.